రీల్స్, టిక్ టాక్ వీడియో, షార్ట్స్.. పేరు ఏదైతేనేమి ఎంతో మంది టైమ్ పాస్ కోసం చూస్తూ ఉన్నారు. మరెంతో మంది అదే పనిగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈ రీల్స్ తో పాపులారిటీ సంపాదించుకోవాలని కూడా చాలా మంది భావిస్తూ ఉన్నారు. లోకల్ గా సెలెబ్రిటీలు అవ్వడానికో.. లేక దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకోడానికో.. కొందరు చేస్తున్న పిచ్చి పిచ్చి పనులు ప్రాణాల మీదకు కూడా తీసుకుని వస్తున్నాయి.
ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఆదివారం రైల్వే ట్రాక్‌కు కేవలం అంగుళాల దూరంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తుండగా రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని అజయ్‌గా గుర్తించారు. అతను స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వడ్డేపల్లి రైల్వే ట్రాక్‌పై రీల్స్ లో భాగంగా బ్యాక్‌గ్రౌండ్ లో వేగంగా వస్తున్న రైలును ఉంచాలని భావించి విద్యార్థి ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా కెమెరాకు ఫోజులిస్తుండడానికి ప్రయత్నించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అనుకున్న స్టంట్ విఫలమవ్వడం.. ఒక్కసారిగా రైలు ఢీకొనడంతో గాలిలో ఎగిరిపడ్డాడు. రైలు కాజీపేట నుంచి మంచిర్యాల వెళ్తున్నట్లు సమాచారం.
ట్రాక్‌పై రక్తంతో తడిసిన అజయ్‌ను గమనించిన రైల్వే గార్డు 108 అంబులెన్స్ సేవకు కాల్ చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నివేదికల ప్రకారం.. అజయ్ తలకు, ఎడమ చెవిపై గాయాలు ఉన్నాయి.