బావిలో జీపు బోల్తా ఘటన: మృతి చెందింది ఒక్కడే
By సుభాష్ Published on 29 Oct 2020 10:47 AM ISTవరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద మంగళవారం సాయంత్రం బావిలో ఓ జీపు బోల్తాపడిన ఘటన విషయం తెలిసిందే. జీపులో 15 మంది వరకు ఉండగా, డ్రైవర్ తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. బుధవారం ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికుల సహాయంతో రాత్రాంతా సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ ఒక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో దాదాపు అందరూ మృతి చెందే ఉంటారన్న ఉత్కంఠ వీడింది.
జీపులో ఉన్న 15 మందిలో 11 మంది బతికి బయటపడగా, డ్రైవర్‌తో పాటు మరో నలుగురు మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ముందుగా డ్రైవర్ మృతదేహం బయటపడగా, మరో నలుగురు బావిలో ఉంటారని భావించారు. ఈ మేరకు తెల్లవారుజాము వరకు నీరంతా తోడారు. మృతదేహాలు లభించకపోవడంతో డ్రైవర్ ఒక్కరే మృతి చెంది ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డ్రైవర్‌కు సతీష్‌కు ఫిట్స్ రావడమే ప్రమాదానికి కారణమని భావిస్తుండగా, పోస్టుమార్టం నివేదిక అందితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.