ఎన్‌కౌంటర్‌లు వద్దు.. ఈ మాటలు అన్నది ఎవరో తెలిస్తే షాకే..!

By అంజి  Published on  7 Dec 2019 7:20 AM GMT
ఎన్‌కౌంటర్‌లు వద్దు.. ఈ మాటలు అన్నది ఎవరో తెలిస్తే షాకే..!

వరంగల్‌ అర్బన్‌: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎన్‌కౌంటర్‌ చేయడమే పరిష్కారం కాదన్నారు వరంగల్‌ యాసిడ్‌ దాడి బాధితురాలు టీ. ప్రణీత. నిందితలను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రణీత పేర్కొన్నారు. 2008లో తమపై యాసిడ్‌ దాడి చేసిన వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా తనకు న్యాయం జరిగిందన్న భావన కలగడం లేదని హఫింగ్టన్‌ పోస్టుకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రణీత తెలిపారు. పోలీసులు మహిళలపై దాడులు జరగకుండా చూడాలన్నారు. అప్పుడే మహిళలకు సరైన న్యాయం జరుగుతుందని టీ.ప్రణీత వ్యాఖ్యనించారు.

వరంగల్‌లో జరిగిన యాసిడ్‌ దాడిలో గాయపడిన స్వప్నిక 20 రోజుల తర్వాత మృతి చెందింది. ప్రస్తుతం వరంగల్‌ యాసిడ్‌ దాడి బాధితురాలు ప్రణీత అమెరికాలోని డెన్వర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆనాడు జరిగిన ఎన్‌కౌంటర్‌కు తానే కారణమని పలువురు అంటుంటే తనకు చాలా బాధ కలిగేదని ప్రణీత చెప్పుకొచ్చారు. ఆ ఎన్‌కౌంటర్‌ ఇప్పటికీ తనను నీడలా వెంటాడతూనే ఉందని.. ఎన్‌ కౌంటర్‌ మాట విన్నప్పుడల్లా తనకు భయమేస్తుందని ప్రణీతి పేర్కొన్నారు. నేనోక సామాన్య విద్యార్థిని అని.. ఆ రోజు తన స్నేహితురాలు స్వప్నికతో కళాశాలకు వెళ్లివస్తుండగా యాసిడ్‌ దాడి జరిగిందని తెలిపింది.

యాసిడ్‌ దాడి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా తనకు న్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదని ప్రణీత తెలిపారు. తన శరీరానికి ఇప్పటికే 14 సర్జరీలు చేశారని.. తాను మమూలు స్థితికి వచ్చినప్పుడే నాకు న్యాయం జరిగిందని భావిస్తానని ప్రణీత అన్నారు. యాసిడ్‌ దాడి ఘటన తనను ఇప్పటికే గుర్తు చేస్తునే ఉందన్నారు.

దిశ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రణీత. దిశకు తన చెల్లెలు ఫోన్‌లో చెప్పినట్టుగా టోల్‌ప్లాజా వద్ద నిలబడి ఉంటే ఈ దారుణ ఘటన జరగేది కాదేమోనని అభిప్రాయపడ్డారు. మహిళలపై అత్యాచారాలు చేసినా తమను ఎవరు పట్టుకోలేరని, ఒకవేళ దొరికినా బెయిల్‌పై బయటికి రావచ్చనే ధీమాతోనే చాలమంది ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని ప్రణీత అన్నారు. మహిళల ఫిర్యాదులపై పోలీసులు తక్షణం స్పందిస్తే ఇలాంటి దారుణాలు జరగవన్నారు. నిందితుల చేసిన అఘాయిత్యాలపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించాలి. కేసును పకడ్బందీగా విచారించి శిక్షలు అమలు చేస్తే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని టీ.ప్రణీత పేర్కొన్నారు.

Next Story