నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు...అందుకే...

By Newsmeter.Network  Published on  6 Dec 2019 11:43 AM GMT
నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు...అందుకే...

'దిశ' ఘటనపై నిందితులను విచారించే క్రమంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించి, పైగా తమపై రాళ్లు రువ్వి ఎదురు దాడికి దిగే క్రమంలో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులు పోలీసు అధికారుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని దాడికి దిగారని అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను లొంగి పోవాల్సిందిగా పలుమార్లు హెచ్చరించినా..ఖాతరు చేయకుండా పోలీసులపై దాడికి దిగి పారిపోవడానికి ప్రయత్నించి, ఫైర్ ఓపెన్ చేశారని వివరించారు. కాసేపటి తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, నలుగురు నిందితులూ విగత జీవులుగా పడి ఉన్నారని సజ్జనార్ వివరించారు.

నిందితుల దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ సందర్భంగా నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ లు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు.

శుక్రవారం వేకువజామున 5.45 నుంచి 6.15 గంటల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పారు. నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో ఘటనా స్థలంలో 10 మంది పోలీసు అధికారులు మాత్రమే ఉన్నారని తెలిపారు.

ఏ1 మహమ్మద్ ఆరిఫ్ ఓ పోలీసు అధికారి వద్ద నుంచి తుపాకీ లాక్కొని దాడికి యత్నించడని, ఆ వెంటనే ఏ4 నిందితుడు చెన్నకేశవులు కూడా మరో తుపాకీ లాక్కొని కాల్పులకు యత్నించాడని ఆయన అన్నారు. మరో ఇద్దరు నిందితులు రాళ్లతో పోలీసులపై దాడికి ప్రయత్నించారని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసు అధికారులెవ్వరికీ బుల్లెట్ గాయాలు కాలేదని. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు, ఓ కానిస్టేబుల్‌కు మాత్రం గాయాలైనట్లు చెప్పారు.

నిందితులను డిసెంబర్ 4న పోలీసు కస్టడీలోకి తీసుకున్నామని.. విచారణలో దిశ కేసుకు సంబంధించి వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించామని అన్నారు. సంఘటనా స్థలంలో బాధితురాలి సెల్ ఫోన్‌ను నిందితులు పాతిపెట్టినట్లు విచారణలో తేలిందన్నారు. ఆ సెల్ ఫోన్‌ను రికవరీ చేశామన్నారు. నిందితులు కరుడుగట్టిన నేరగాళ్లని.. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో మరిన్ని నేరాల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు తమకు అనుమానాలున్నాయన్నారు. ఏదిఏమైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌పై పూర్తి నివేదికను కోర్టకు సమర్పించనున్నట్లు వివరించారు.

Next Story