నర్సులు ఎక్కడున్నా కావలెను..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 31 July 2020 10:48 PM ISTకరోనా పేషంట్లు అంతకంతకు పెరిగిపోతుంటే.. వారిని పర్యవేక్షించి సేవలందించే నర్సుల సంఖ్య పడిపోతోంది. డాక్టర్లే ఎల్లకాలం పేషంట్లను కనిపెట్టుకుని ఉండే పరిస్థితి లేదు. నర్సులు లేనిదే బండి నడవడం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రులు వారికోసం ప్రకటనలు ఇస్తున్నాయి. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వేతనం ఇవ్వడానికి వారు రెడీ! ఉచిత వసతులు, భోజనాదులు అదనం. కేరళే కాదు ఎక్కడ్నుంచైనా సరే కొలువు చేస్తామంటే ఫ్లైట్‌లలో రప్పించేందుకు కూడా వెనకాడట్లేదు. బీఎస్సీ, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సులు చదివిన వారు ఓ ఆరునెలలపాటు సేవలందించడానికి రండహో అంటూ టముకు కొట్టి మరీ పిలుస్తున్నారు.
కరోనా నేపథ్యంలో నర్సులకు మూడురెట్ల జీతం పెరిగింది. 10వేల నుంచి 15 వేల దాకా జీతాలుంటే ఇప్పుడ ఏకంగా 50వేల దాకా అంటే వినడానికే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అవసరం అలాంటిది మరి. మంచి తరుణం మించిన దొరకదు ఇది నర్సులకే కాదు కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా! అందుకే అవి అవసరమైతే అనుభవాన్ని బట్టి లక్షదాకా వేతనం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాయంటే అవసరం ఎంత ఉందో అర్థమవుతుంది. కరోనా అంటూ రాగానే చాలా మంది భయపడితే...కొన్ని కార్పొరేట్‌ఆస్పత్రులు మాత్రం మనసులోనే పండగ చేసుకున్నాయి. సాధారణంగా ఎవరైనా ఆస్పత్రి మెట్లెక్కితే చాలు తమ వద్ద ఉన్న అన్ని పరీక్షలు చేసిగానీ వదలరు.
కానీ కరోనా వచ్చాక జనరల్ పేషెంట్ల తాకిడి బాగా తగ్గిపోయింది. మరి నిర్వహణ ఖర్చులెలా అని తలపట్టుకున్న వారికి ప్రభుత్వం కోవిడ్ చికిత్సకూ అనుమతి ఇవ్వడంతో ప్రాణం లేచి వచ్చింది. అయితే బెడ్లున్నా సేవలందించే నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేకపోదడంతో నిస్సహాయంగా ఉండి పోయారు. తర్వాత కాస్త ఆలోచించి ఎలాగైనా బైట రాష్ట్రాల నుంచైనా సరే అనుభవమున్న నర్సులను కాంట్రాక్టు పద్ధతిన రప్పించాలని నిర్ణయించుకున్నారు. ఓ ఆరునెలలే కాబట్టి ఎంత జీతం ఇవ్వడానికైనా వెనకాడట్లేదు.
ఈ పరిస్థితుల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని నర్సులకు గిరాకీ పెరిగింది. ఈ విషయంగా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రుద్రావత్ మాట్లాడుతూ ‘ ప్రస్తుతం నగరంలో నర్సుల కొరత చాలా తీవ్రంగా ఉంది. నర్సులుంటే పంపాల్సిందిగా లెక్కకు మిక్కిలిగా రిక్వెస్టులు ఆస్పత్రుల నుంచి వస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే..చాలా మంది నర్సులు వాళ్ల సొంతూళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పడు ఉద్యోగమిస్తాం రమ్మన్నా రావడం లేదు. జీతాలు రూ.50 వేల దాకా ఇస్తామన్నా నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ’ అంటూ చెప్పారు.
ఓ కార్పొరేట్ ఆస్పత్రి ప్రతినిధి మాట్లాడుతూ..‘ భారీగా జీతాలివ్వడానికి సిద్ధపడుతున్నా... నర్సులు దొరకడం లేదు. వారికి జీతంతోపాటు ఇతర సౌకర్యాలు వసతి భోజనం లాంటివి ఉచితంగా కల్పిస్తామన్నా ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి వారికి రూ.50వేల దాకా జీతం అంటున్నా...మిగిలిన ఖర్చులు కలిపితే అది రూ.70వేల నుంచి రూ.75 వేలదాకా ఉంటుంది. ఇన్నేసి వేలు జీతాలిస్తామన్నా...ఎవరూ స్పందించడం లేదు. పోటీ కూడా విపరీతంగా ఉంటోంది’ అని నిస్సహాయత వ్యక్తం చేశారు.
నగరంలో చాలా ఆస్పత్రులు ప్రస్తుతం 50శాతం నర్స్ స్టాఫ్‌తోనే నడిపిస్తున్నారు. చాలా మంది లీవులు దొరక్కపోయినా వెళ్ళిపోయారు. ‘ మా ఆస్పత్రిలో చాలా మంది నర్సులు మే జూన్‌లలో లీవులు దొరక్కపోయినా వెళ్ళిపోయారు. ఇప్పటి దాకా వారి సమాచారం లేదు. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. ప్రస్తుతం నర్సుల కోసం ఆస్పత్రుల మధ్య పోటాపోటీగా ఉంది. దీన్ని అధిగమించడానికి కార్పొరేట్ ఆస్పత్రుల అడ్మినిస్ట్రేషన్ పరస్పరం చర్చించుకుని కనీసం డిప్యుటేషన్‌పై నర్సులను నియమించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. నర్సింగ్ కాలేజీ అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అయితే ప్రస్తుతం వారికీ ఈ కొరత వచ్చిపడుతోంది.’ అని ఓ కార్పొరేట్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ తెలిపారు.
ప్రభుత్వం గురువారం విడుదల చేసిన లెక్కల ప్రకారం 95 ప్రైవేట్,కార్పొరేట్ ఆస్పత్రుల్లో 5వేల పైచిలుకు పడకలు కరోనా కోసమే ప్రత్యేకించి కేటాయిస్తే వాటిలో రెండువేల దాకా ఖాళీగా ఉంటున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం దాదాపు వెయ్యి మంది నర్సులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అదే నర్సింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రతి పది మంది నర్సుల్లో ముగ్గురు కోవిడ్ బారిన పడినవారే! ఈ నేపథ్యంలో నర్సులు కావాలంటూ వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు జారీ చేస్తున్నారు. బృందంగా ఏర్పడి వచ్చేమాటైతే వారికోసం చార్టర్డ్ ఫ్లైట్లను ఏర్పాటు చేసేందుకు కూడా వెనకాడట్లేదు. ఇటీవల ఓ ఆస్పత్రి కేరళనుంచి నర్సుల్ని రప్పించింది. వారి అనుభవాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.లక్షదాకా ఇచ్చేందుకు సిద్ధపడిందట!
సో మరి నర్సులు మంచి తరుణం మించిన దొరకదు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారా.. మనకెందుకొచ్చిన గొడవ. జీతం సంగతి దేవుడెరుగు జీవితం బాగుంటే చాలు. బతికి బట్ట కట్టడం ముఖ్యం అనుకుంటున్నారో లోగుట్టు పెరుమాళ్ళకెరుక! కాకపోతే ఈ కరోనా రాకముందు నర్సల దుస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మనం. ప్రైవేటు ఆస్పత్రుల్లోని నర్సులు, పారామెడికల్ సిబ్బందికి దక్కుతున్న జీతం అంతంత మాత్రమే! వారి గురించి ఆలోచించిన వారూ లేరు. కనీసం ఏడాదికి వందల్లో కూడా జీతాలు పెరిగిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. కానీ కరోనా కష్టకాలంలో మా విలువ తెలిసొచ్చిందని నర్సులు మనసులో అయినా అనుకుంటుంటారేమో కదా!!