ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానన్న 'జెర్సీ' నటి
By సుభాష్ Published on 18 Oct 2020 12:39 PM ISTబాలనటిగా గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాల్లో సహాయ నటిగా నటిస్తున్న ముద్దుగుమ్మ సనూష. తెలుగులో 'బంగారం' చిత్రంలో హీరోయిన్ సోదరి వింద్య పాత్రలో సనూష నటనను ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేరు. నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ' చిత్రంలో సనూష జర్నలిస్ట్ రమ్య పాత్రలో మెరిసింది.
తాను జీవితంలో కొన్ని పరిస్థితుల కారణంగా డిప్రెషన్, మనస్తాపానికి గురయ్యానని సనూష ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని.. దీంతో తీవ్ర ఆందోళన చెందానని తెలిపింది. గతంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకున్నానని, తన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపింది. కాగా.. దీనిపై కొందరు నెటీజన్లు ఆమెపై ట్రోలింగ్స్, నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఆ అభ్యకర కామెంట్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తాను తన మానసిక ఆరోగ్యం గురించి చెబితే కొందరు నెటిజన్లు నాపై నెగెటివ్ కామెంట్లు చేశారని తెలిపింది. 'మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడేవాళ్లు.. నా వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే నేను ధైర్యంగా మాట్లాడగలిగాను 'అని ఆమె చెప్పారు. కాగా, ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.