ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో.. రాత్రికి రాత్రే గోడ‌లు క‌ట్టేశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2020 7:36 AM GMT
ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో..  రాత్రికి రాత్రే  గోడ‌లు క‌ట్టేశారు

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించారు. క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న సూచ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అమ‌లు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయిన‌ప్ప‌టికి క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాగా ఇప్పుడు.. త‌మిళ‌నాడు అధికారులు చేసిన ప‌ని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. క‌రోనా క‌ట్ట‌డి పేరుతో ఏపీ, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లో ఏకంగా గోడ‌లు క‌ట్టేశారు. చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడను నిర్మించారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. అయితే, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. స్థానికులు ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో రోడ్డకు అడ్డంగా 6 అడుగుల మేర రాత్రికి రాత్రే గోడలను కట్టివేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి కానీ.. ఇలా గోడలు కట్టడం ఏంటి? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 80 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 31 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇక తమిళ‌నాడు రాష్ట్రంలో ఇప్ప‌టికే 1885 మంది క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతుండ‌గా.. 24 మంది మ‌ర‌ణించారు. ఇక త‌మిళ‌నాడులో న‌మోదైన కేసుల్లో 1450 కేసులు ఢిల్లీ మ‌ర్క‌జ్ లింకులు కావ‌డం గ‌మ‌నార్హం

Next Story
Share it