వాళ్లూవీళ్లని లేదు..పనిచేయని వాళ్లను ఇంటికి పంపిన ఓటర్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 4:12 PM GMT
వాళ్లూవీళ్లని లేదు..పనిచేయని వాళ్లను ఇంటికి పంపిన ఓటర్లు..!

పనితీరుకే ప్రజలు పట్టం కట్టారు. పెద్ద కుటుంబాలకు చెందినవాళ్లు, సామాన్యులు అన్న తేడా చూపలేదు. పని చేయని వారిని ఇంటికి సాగనంపారు. ఇష్టారాజ్యం గా మాట్లాడేవారు, అవినీతి మరకలు అంటిన నాయకులను దూరం పెట్టారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్న విషయం ఇదే.

హర్యానాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. ప్రముఖ నాయకులు, హేమాహేమీలు ఓడిపోయారు. మంత్రులే పరాజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి మనోహ ర్ లాల్ ఖట్టర్, మరో మంత్రి అనిల్ విజ్ మాత్రమే గెలుపొందారు. స్పోర్ట్స్ స్టార్లకు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఫేమస్ రెజ్లర్లు బబితా ఫొగట్, యోగేశ్వర్ దత్‌లు ఓటమి పాలయ్యారు. బరోడాలో యోగేశ్వర్ దత్ పరాజయం పాలవగా, దాద్రిలో బబితా ఫొగట్ ఓడిపోయారు. భారత హాకీ టీం మాజీ కెప్టెన్ సందీప్ సిం గ్ మాత్రం విజయం సాధించారు. బబిత, యోగేశ్వర్, సందీప్‌సింగ్‌లు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. కాంగ్రెస్‌కు కూడా చేదు ఫలి తాలు వచ్చాయి. ఆ పార్టీ కీలక నాయకుడు రణ్‌దీప్ సూర్జేవాల కైతాల్‌లో పరాజయం పాలయ్యారు. ఇక, ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన జేజేపీ అధ్య క్షుడు దుష్యంత్ సింగ్ తన ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు.

మహారాష్ట్రలోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కొందరు వీఐపీలు గెలుపొందితే, మరికొందరు ప్రముఖులు ఓడిపోయారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాగపూర్ సౌత్ వెస్ట్ నుంచి మరోసారి విజయం సాధించారు. యువ నేత, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లి నుంచి ఘన విజయం సాధించారు. ఐతే, మంత్రి పంకజ ముండే అనూహ్యంగా ఓడిపోయారు. ముండే కుటుంబానికి గట్టి పట్టున్న పర్లిలో ఆమె ఓటమి పాలయ్యారు. సోదరుడి చేతిలోనే ఆమె ఓడి పోయారు. ఎన్సీపీ అభ్యర్థి ధనుంజయ్ పాండే, పంకజ ముండేపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇదిలా ఉంటే, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ సంచలనం సృష్టించారు. ఆయన ఏకంగా లక్షా 60 వేల పైచిలుకు ఓట్లతో భారీ విజయం సాధించారు. అక్కడ ప్రత్యర్థులెవరికీ డిపాజిట్లు దక్కలేదు.

Next Story