భయంతో పరుగులు పెట్టిన ప్రజలు.. రోడ్డుపైనే అపస్మారక స్థితిలోకి..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 May 2020 8:13 AM ISTవిశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 2000మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయినట్లు తెలుస్తుంది. తెల్లవారుజామున 4 గంటలకు పరిశ్రమ నుండి వెలువడిన రసాయన వాయువు 5 కిలోమీటర్ల మేర వ్యాపించింది. లీకైన రసాయన వాయువును పీల్చడంతో.. అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు.
రసాయన వాయువు పీల్చడంతో.. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అక్కడి ప్రజలు ఇల్లు వదిలి పరుగులు తీశారు. ఆ సమయంలో రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై రోడ్డుపైనే అపస్మారకస్థితిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని ఆంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలావుంటే.. గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్ కారణంగా కంపెనీ మూసివుంది. అయితే.. మూసి ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి విడుదలైన గ్యాస్ స్టేరైన్ అని తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. భయంతో తలుపులు వేసుకొని ఇళ్లల్లో ఉన్న ప్రజలను వేరే చోటికి తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఘటనపై సీఎం జగన్ కలెక్టర్ వినయ్‌చంద్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె. మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.