వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన ఇండియన్‌ నేవీ.. కారణం..

By అంజి  Published on  22 Feb 2020 1:44 PM GMT
వైఎస్‌ జగన్‌ సర్కార్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన ఇండియన్‌ నేవీ.. కారణం..

అమరావతి: సీఎం జగన్‌ ప్రభుత్వానికి ఇండియన్‌ నావీ భారీ ట్విస్ట్‌ ఇచ్చింది. పరిపాలనా రాజధాని తరలింపులో భాగంగా... విశాఖలోని మిలీనియం టవర్స్‌లో పరిపాలన విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న వైసీపీ ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుందని తెలుస్తోంది. మిలీనియం టవర్న్‌లో వైసీపీ ప్రభుత్వం సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలనుకుంది. అయితే ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వానికి నేవీ లేఖ రాసింది.

దేశ రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్‌ఎస్‌ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్‌ ఉన్నాయని ఆ లేఖలో పేర్కొంది. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడం, మిలీనియం టవర్స్‌లో పరిపాలన విభాగాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దేశ భద్రతకు సంబంధించి ఇండియన్‌ నేవీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్‌ఎస్‌ కళింగకు సమీపంలో ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది. విశాఖపట్నం శుత్రుదేశాలకు ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చింది.

విశాఖలోనే ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని చెప్పింది. దేశ భద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని.. రాజధానిగా ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమమని నేవీ అధికారులు అంటున్నారు. రాజధానిగా విశాఖ ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా పూర్తిగా జనాలతో నిండిపోతుందని నేవీ తెలిపింది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఐఎన్‌ఎస్‌ కళింగ వ్యహాత్మక ప్రాంతమన్న నేవీ.. రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది.

తూర్పు నావికా దళానికి అత్యంత కీలకమైన ఐఎన్‌ఎస్‌ కళింగ సుమారు 734 ఎకరాల్లో విస్తరించి ఉంది. తూర్పు నావికా దళంపై మరింత దృష్టి కేంద్రీకరిస్తోన్న నేవీ.. మరిన్ని భూములు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. నేవీ, రెవెన్యూ శాఖల మధ్య ఇప్పటికే.. 400 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. అయితే నేవీ లేఖపై ప్రభుత్వ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. రాజధానిని విశాఖ తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షాలను సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి చర్చించారు. ఇటు శాసనమండలి రద్దుకు త్వరలోనే ఆమోదముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story