ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌ నుంచి తప్పుకున్న వీవో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 5:18 PM IST
ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌ నుంచి తప్పుకున్న వీవో

కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌ యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. గత కొన్నాళ్లుగా ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో.. ఈ ఏడాది ఐపీఎల్‌ స్పాన్సర్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. దీంతో బీసీసీఐ ఈ ఏడాది మరో కొత్త స్పాన్సర్‌ కోసం వెతుక్కోనుంది. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోతో ఐపీఎల్ కు ఐదేళ్ల కాంట్రాక్టు ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2022లో ముగియనుంది.

ఇటీవల సరిహద్దులో ఉన్న వివాదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ నుంచి చైనా కంపెనీ అయినటువంటి వివో ను తప్పించాలని దేశ వ్యాప్తంగా ఆగ్రహా జ్వాలలు వ్యక్తం అయినప్పటికి ఆదివారం జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో వివోను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. మంగళవారం వివో ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. వివోతో ఒప్పందం 2020 వరకు ఉండడంతో బీసీసీఐ.. కాంట్రాక్టును రద్దు చేసినట్లయితే.. న్యాయ పరమైన చిక్కులకు అవకాశం ఉండేది. కాగా.. వివోనే ప్రస్తుతం తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఎలాంటి ఇబ్బందులు అవకాశం లేనట్లే..

ఇక ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అబుదాబి, దుబాయ్‌, షార్జా వేదికలుగా 51 రోజుల పాటు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 19న ప్రారంభం కానుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 10న జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్‌ మ్యాచ్‌లు రా.7.30కే ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లు 3.30కు ప్రారంభం కానున్నాయి.

Next Story