ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ పిలుపు.. కారణం ఏమిటంటే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 5:54 AM GMT
ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ పిలుపు.. కారణం ఏమిటంటే..!

యూఏఈ వేదికగా ఐపీఎల్ సెప్టెంబరు 19న మొదలై నవంబరు 10న ముగియనుంది. ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వివో కూడా ఓ చైనా సంస్థ కనుక, ఆ సంస్థను స్పాన్సర్ షిప్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. వివో సంస్థతో ఐపీఎల్ కు మరో రెండేళ్లపాటు కాంట్రాక్టు ఉందని, ఇప్పుడు స్పాన్సర్ షిప్ నుంచి తొలగించలేమని అధికారులు స్పష్టం చేశారు. గతేడాది ఉన్న స్పాన్సర్లందరూ ఈ సీజన్ కు కూడా కొనసాగుతారని బోర్డు తెలిపింది.

దీనిని ఆర్.ఎస్.ఎస్.(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ తప్పుబట్టింది. స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ఒక వ్యాపారం దానిని నడుపుతున్న వారు దేశ భావాలను పట్టించుకోరని విమర్శించారు. ప్రపంచం మొత్తం చైనాను బహిష్కరిస్తుంటే, ఐపీఎల్ మాత్రం దేశ భావాలను దెబ్బతీస్తోందని పేర్కొంది. దేశమంతా చైనా కంపెనీలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బీసీసీఐ మాత్రం వాటినే కొనసాగించడం తగదంటున్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగుతున్న వివోను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే ఐపీఎల్‌ను బహిష్కరించాలంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది ఈ సంస్థ..!

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోతో ఐపీఎల్ కు ఐదేళ్ల కాంట్రాక్టు ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2022లో ముగియనుంది.

ఆటగాళ్లకు అయిదు రోజులకొకసారి కోవిద్ పరీక్షలు నిర్వహించనున్నారు. భారత్‌ నుంచి ఐపీఎల్‌లో పాల్గొనేందుకు వెళ్లే ఆటగాళ్లకు రెండువారాల్లో నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఐపీఎల్‌ కోసం వెళ్లేముందు భారత్‌లో రెండుసార్లు.. యూఏఈలో క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మరో రెండుసార్లు కరోనా పరీక్షలు చేస్తారు. యూఏఈ వెళ్లే ప్రతీ ఆటగాడు DXB యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story