బంపర్‌ ఆఫర్: ఆయన వైసీపీలోకి వస్తే ఐదేళ్లు తిరుగులేదు..!

By సుభాష్  Published on  2 April 2020 6:01 AM GMT
బంపర్‌ ఆఫర్: ఆయన వైసీపీలోకి వస్తే ఐదేళ్లు తిరుగులేదు..!

రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి అదృష్టం వరిస్తుందే చెప్పలేని పరిస్థితి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఇక మహరాజులే. కొందరికి అదృష్టం కలిసివస్తే ఐదేళ్లు తిరుగుండదు. దాదాపుగా నాయకులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు తప్ప.. వదులుకోరు. కొందరికి అనుకోకుండానే మంచి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు ఓ నాయకుడికి అలాంటి అవకాశం రాబోతోంది. ఆయనే విశాఖ గాజువాక టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌. ఈయన బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం వైసీపీ ఇచ్చే బంపర్‌ ఆఫర్‌ ఆయన చుట్టే తిరుగుతోందని తెలుస్తోంది.

గతంలో టీడీపీలో ఉన్న పల్లా శ్రీనివాస్‌ 2009లో ప్రజారాజ్యంలో తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్‌ విశాఖ నుంచి ప్రజారాజ్యం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్‌ బ్యాచ్‌తో పాటు టీడీపీలోకి వచ్చిన శ్రీనివాస్‌ గాజువాక నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ.. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ తరపున పోటీ చేసిన నాగిరెడ్డి గెలుపొందారు. ఇక అదే సమయంలో జనసేన నుంచి పవన్‌ కల్యాణ్‌ కూడా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి పల్లా శ్రీనివాస్‌ రెండో స్థానంలో నిలిచారు.

విశాఖపైనే వైసీపీ కన్ను..

ఇక విశాఖ నగర వైసీపీ కాస్త వెనుకబడి ఉండటంతో మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకు వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖ జిల్లాలోనూ, నగరంలోనూ పలువురు మాజీలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో బలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విశాఖ పార్లమెంట్‌ పరిధిలోని యాదవుల ఓట్లు వైసీపీకి వచ్చేలా ప్రయత్నించడమే కాకుండా మేయర్‌ పదవిని కూడా వైసీపీ చేజిక్కించుకోవాలన్నదే విజయసాయిరెడ్డి టార్గెట్‌. దీంతో పల్లా శ్రీనివాస్‌ను వైసీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని టాక్. అంతేకాదు ఆయనకు కీలక పదవి ఇస్తామని కూడా బంపర్‌ ఆఫర్‌ ఇస్తుందట వైసీపీ. విశాఖ మేయర్‌ పదవిని కట్టబెడతామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే పల్లా శ్రీనివాస్‌కు ఇది మంచి అవకాశమేనని చెబుతున్నారు రాజకీయ నేతలు.

ఐదేళ్లు తిరుగులేదు

ఒక వేళ ఆయన అంగీకరించి వైసీపీలో చేరిపోతే వచ్చే ఐదేళ్లు ఆయనకు తిరుగులేదంటున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ పుంజుకునే అవకాశం లేదు. వైసీపీలోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అనుచరులు కూడా చెబుతున్నారట. కానీ పల్లా శ్రీనివాస్‌ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే కరోనా వైరస్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో పల్లా శ్రీనివాస్‌తో వైసీపీ నేతలు మరోసారి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గంటా శ్రీనివాస్‌ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్‌ ఇప్పుడు అంగీకరించకపోయినా.. సమయం చూసుకుని వైసీపీలోకి జంప్‌ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి శ్రీనివాస్‌తో వైసీపీ చర్చలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Next Story
Share it