ఉత్తరాంధ్రకు తుఫాన్ గండం తప్పినా సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం బాగా ముందుకొచ్చింది. బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. సమీపంలోని చిల్డ్రన్ పార్కు ప్రహారీ గోడ కూలిపోయింది. దీంతో అందులో ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలు చోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఆర్కేబీచ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా పర్యాటకులకు అనుమతిని నిషేదించారు. చిల్డ్రన్స్ పార్కుకు వచ్చే మార్గాన్ని బారికేడ్లతో జీవీఎంసీ మూసేసింది. పార్కు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ ముందుభాగంలోనూ బారికేడ్లు పెట్టారు. జొవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో సముద్రం ముందుకు వచ్చి ఉంటుందని అంటున్నారు.