విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ మార్చి 28న విశాఖపట్నం నగర బంద్‌కు పిలుపునిచ్చింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరాహార దీక్ష రేపటితో 400వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో సదస్సు నిర్వహించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని.. బంద్‌కు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
100 మంది ఎంపీల సంతకాలతో ఢిల్లీకి వెళ్లి వారం రోజుల పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వాటాలను విక్రయించి.. సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పటికీ.. కేంద్రం ప్రైవేటీకరణకు మొగ్గుచూపింది. ఇదిలావుంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాశారు.