విశాఖ ప్ర‌త్యేక న‌గ‌రం.. అండ‌గా ఉంటాం : ప్ర‌ధాని మోదీ

PM Modi Speech in Visakhapatnam Public meeting.భార‌త‌దేశానికి విశాఖ ప్ర‌త్యేక న‌గ‌రం అని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2022 7:04 AM GMT
విశాఖ ప్ర‌త్యేక న‌గ‌రం.. అండ‌గా ఉంటాం : ప్ర‌ధాని మోదీ

భార‌త‌దేశానికి విశాఖ ప్ర‌త్యేక న‌గ‌రం అని, ఇక్క‌డి ఓడ‌రేవు చారిత్రక‌మైంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. విశాఖ‌లోని ఏయూ మైదానంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు. దాదాపు రూ.15వేల కోట్ల‌కు పైగా విలువైన ప్రాజెక్టును వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. అనంత‌రం మోదీ ప్ర‌సంగించారు.

"ప్రియ‌మైన సోద‌రీసోద‌రులారా.. న‌మ‌స్కారం" అంటూ తెలుగులో ప్ర‌జ‌ల‌కు మోదీ అభివాదం చేశారు. అనంత‌రం ప్ర‌ధాని మాట్లాడుతూ.. కొద్ది నెల‌ల కింద‌ట విప్ల‌వ‌వీరుడు అల్లూరి జ‌యంతి వేడుక‌ల్లో మిమ్మ‌ల్ని క‌లుసుకున్నాను. ఇప్పుడు మ‌రోసారి మిమ్మ‌ల్ని క‌లుసుకునే అదృష్టం వ‌చ్చింద‌న్నారు. ఈ రోజు విశాఖ‌కు మ‌రుపురాని రోజు అని అన్నారు. భార‌త్‌కు విశాఖ ప్ర‌త్యేక‌మైన న‌గ‌రం. ప్రాచీన భార‌త‌దేశంలో విశాఖ ప్ర‌ముఖ ఓడ‌రేవు వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. ఎన్నో ఏళ్లుగా ప్ర‌ముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరాజిల్లుతోంది. వెయ్యేళ్ల క్రితమే ఇక్కడి నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేదని అన్నారు.

తాను ఈరోజు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో విశాఖతో పాటు, ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర‌ ప్రజలు మంచి వారని, స్నేహ స్వభావం కలిగిన వారని కొనియాడారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పుడు తనను కలిసినా ఏపీ శ్రేయస్సు, ప్రయోజనాల గురించే మాట్లాడేవారని అన్నారు. ఇక రాష్ట్ర ప్ర‌జ‌లు అన్ని రంగాల్లో త‌మ ప్ర‌తిభ‌ను చాటుతున్నార‌ని తెలిపారు.

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. విశాఖలో చేపల రేవును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. మన దేశంలో రవాణా వ్యవస్థలో పలు మార్పులు వచ్చాయని తెలిపారు. భారత్ అనేక సవాళ్లను అధిగమించిందని, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రశంసలు పొందుతోందని, భారత్ కు పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. భార‌త్‌ను అభివృద్ధి ప‌థంలో తీసుకువెళ్ల‌డంలో ఏపీ ముఖ్య భూమిక పోషిస్తుంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు.

Next Story