విశాఖ: పాఠశాలలో ఊడిన పెచ్చులు.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు

Plaster of concrete ceiling falls on students in vizag. విశాఖపట్నంలోని పద్మనాభం పంచాయతీ పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో

By అంజి  Published on  8 Feb 2023 5:59 AM GMT
విశాఖ: పాఠశాలలో ఊడిన పెచ్చులు.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు

విశాఖపట్నంలోని పద్మనాభం పంచాయతీ పరిధిలోని అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం జరిగింది. పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో అకస్మాత్తుగా పెచ్చులు ఉడిపడ్డాయి. దీంతో తరగతిలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులకు క్లాస్‌ తీసుకోవడంలో బిజీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫస్ట్‌ క్లాస్‌ విద్యార్థి తాలాడ వేదశ్రీ తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన పాఠశాల భవనాన్ని నాడు - నేడులో భాగంగా ఇటీవలే పునరుద్ధరించారు. నాణ్యత లేని మెటీరియల్‌ను అధికారులు వాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ తరగతి గదిలో 1 నుంచి 3వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరమ్మతులు చేపట్టిన నెల వ్యవధిలోనే పెచ్చులుడటంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు.


Next Story