Visakhapatnam: పేదవాళ్లే లక్ష్యంగా డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు కాజేస్తున్న ముఠా
కిడ్నీ అక్రమ రవాణా ముఠా విశాఖపట్నంలో 32 ఏళ్ల వ్యక్తి నుండి కిడ్నీని బలవంతంగా సేకరించింది. ఈ ముఠా చేతిలో మోసపోయామని
By అంజి Published on 27 April 2023 11:49 AM ISTVisakhapatnam: పేదవాళ్లే లక్ష్యంగా డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు కాజేస్తున్న ముఠా
విశాఖపట్నం: కిడ్నీ అక్రమ రవాణా ముఠా విశాఖపట్నంలో 32 ఏళ్ల వ్యక్తి నుండి కిడ్నీని బలవంతంగా సేకరించింది. ఈ ముఠా చేతిలో మోసపోయామని గురుజల్ల వినయ్ పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ కిడ్నీ మార్పిడి 2022 డిసెంబర్‌లో పెందుర్తి ప్రాంతంలో జరిగింది. అయితే.. మధురవాడలోని వాంబే కాలనీకి చెందిన బాధితుడు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజుల క్రితం ఇది వెలుగులోకి వచ్చింది.
కిడ్నీ దాత కోసం వెతుకుతున్నామని ఆటో రిక్షా డ్రైవర్ కామరాజు తన వద్దకు వచ్చి చెప్పాడని వినయ్ తెలిపాడు. ఆ తర్వాత వినయ్‌ని కొందరికి పరిచయం చేసి కిడ్నీ దానం చేసేందుకు రూ.8.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. వినయ్‌ని కొన్ని పరీక్షల కోసం అక్టోబర్ 2022లో ఒక ప్రైవేట్ సెంటర్‌కి తీసుకెళ్లారు. అయితే వినయ్ కిడ్నీ ఇవ్వడానికి భయపడి హైదరాబాద్ పారిపోయాడు.
వినయ్ డిసెంబర్ 2022లో విశాఖపట్నంకు తిరిగి వచ్చాడు. అతన్ని కామరాజు, ఎలీనా, శ్రీనులు కిడ్నాప్ చేసి వైజాగ్‌లోని పెందుర్తి సమీపంలోని తిరుమల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వినయ్‌కి ఆపరేషన్ చేసి అతని కిడ్నీని డిసెంబర్ 16, 2022న వైద్యులు తొలగించారు. వినయ్ తర్వాత టాక్సీలో తన ఇంటికి చేరుకున్నాడు.
వినయ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, కామరాజు, అతని బృందం వినయ్ తల్లికి ఒక కవరు ఇచ్చారు. అందులో రూ.5 లక్షలు ఉన్నాయని తెలిపారు. అయితే తెరిచి చూసేసరికి రూ.2.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. వినయ్ కుటుంబ సభ్యులు కామరాజు మరియు అతని బృందం కోసం వెతికారు. అయితే ఈ ముఠా వైజాగ్ నగరంలో అదృశ్యమైంది.
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా, పీఎం పాలెం ఇన్‌స్పెక్టర్ వై రామకృష్ణ ఐపీసీలోని 120 (బి) సెక్షన్ 420, మానవ అవయవాల మార్పిడి చట్టం-1995లోని సెక్షన్ 18, 19తో పాటుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.