‘నమస్కారం’ అంటూ ప్రసంగం ప్రారంభించి.. ఏపీ గురించి అద‌ర‌గొట్టిన ముఖేశ్ అంబానీ

Mukesh Ambani at Investors’ Summit. విశాఖలో ఈ రోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పాల్గొన్నారు.

By Medi Samrat  Published on  3 March 2023 3:50 PM IST
‘నమస్కారం’ అంటూ ప్రసంగం ప్రారంభించి.. ఏపీ గురించి అద‌ర‌గొట్టిన ముఖేశ్ అంబానీ

విశాఖలో ఈ రోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పాల్గొన్నారు. ఆయన ‘నమస్కారం’ అంటూ అంబానీ తన ప్రసంగం ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టాలెంట్ ఉన్న యువత ఉందని.. సహజ వనరులు ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి నదులు.. విశాఖ, తిరుమల లాంటి నగరాలు.. ఇలా ఎన్నో ఉండడం.. పారిశ్రామికవేత్తలకు కలిసొచ్చే అంశాలని వివరించారు. భారతదేశానికి ఏపీ ఎంతో ముఖ్యమని.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయని, అందులో తాము భాగస్వామ్యం అవుతామని.. రాష్ట్రంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని తెలిపారు. ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు, డాక్టర్లు సహా వివిధ రంగాల్లో ఏపీ వాళ్లు ఉన్నారని అంబానీ చెప్పారు. రిలయన్స్ సంస్థలో కూడా చాలా మంది మేనేజర్లు, ప్రొఫెషనల్స్ ఏపీ వాళ్లు ఉన్నారని తెలిపారు.

సీఎం జగన్ వల్ల ఏపీ ముందుకెళ్తోందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. మెరైన్ రంగంలో ఏపీ బాగా అభివృద్ధి సాధించగలదని చెప్పారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. 2002 నుంచి సహజ వాయువు రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందని, దేశంలో 30 శాతం తమ గ్యాస్ ఉత్పత్తి ఏపీ నుంచే జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో జియో ద్వారా 4జీ నెట్‌వర్క్‌ 98 శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. 5జీ టెక్నాలజీని 2023 చివరి నాటికి ఏపీ సహా దేశమంతా విస్తరిస్తామని తెలిపారు. ఏపీలో జియో కోసం 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ పెట్టుబడులు, 5జీ నెట్ వర్క్ రాకతో బిజినెస్, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగబోతున్నాయని వివరించారు. ఏపీలోని 6 వేల గ్రామాలకు రిలయన్స్ రిటైల్ విస్తరించిందని ముఖేష్ అంబానీ వెల్లడించారు. 1.29 లక్షల కిరాణా దుకాణాలతో రిలయన్స్ రిటైల్ సంబంధాలు కొనసాగిస్తోందని అన్నారు.


Next Story