మద్యం మత్తులో ఓ వ్యక్తి వైన్ షాపుకు నిప్పంటించాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో ఆదివారం చోటుచేసుకుంది. పోతిన మల్లయ్య పాలెం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడలోని ఓ వైన్‌షాప్‌కు శనివారం రాత్రి పూట మూసివేసే సమయంలో మధు అనే వ్యక్తి వెళ్లాడు. మద్యం బాటిల్ ఇవ్వాలని కోరగా.. సమయం మించిపోయిందని, దుకాణం మూసేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. దీంతో ఆవేశంతో మధు దుకాణ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో షాపు సిబ్బంది మధును బెదిరించి అక్కడి నుంచి పంపించారు.
అనంతరం దుకాణం మూసివేసి వెళ్లిపోయారు. ఆదివారం సాయంత్రం అదే దుకాణానికి పెట్రోల్ క్యాన్‌తో వెళ్లిన మధు షాపుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. షాపులోని ఫర్నీచర్ దగ్ధమైందని, కంప్యూటర్, ప్రింటర్ ధ్వంసమయ్యాయని ఎస్ ఐ తెలిపారు. రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని తెలిపారు. వైన్ షాపు సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడు మధును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.