సంచలన నిర్ణయం తీసుకున్న కేఏ పాల్
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు గతంలోనే చెప్పిన ఆయన ఇప్పుడు ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కోర్టు అవకాశం ఇస్తే తాను లక్షల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతానని అన్నారు. 10 లక్షల ఉద్యోగాలను ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు చేయడానికి అడుగులు వేస్తున్నదని.. దీనిని అడ్డుకుని తీరుతానని ఆయన అన్నారు. లాభాలను తెచ్చిపెట్టే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అధోగతి పట్టించి దాన్ని కారుచౌకగా అదానీకి కట్టబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రూ. 8 లక్షల కోట్ల విలువైన ఈ పరిశ్రమను కేవలం రూ. 4 వేల కోట్లకే అదానీకి అప్పగించే ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రారంభించారని అన్నారు. మోదీ చేస్తున్న ఈ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వబోమని స్పష్టం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయనని తేల్చి చెప్పారు.