కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజుల పాటు క్రికెట్ స్టేడియంలోకి అభిమానులను అనుమతించలేదు. కరోనా ప్రస్తుతం అదుపులో ఉండడంతో అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. ఈ క్రమంలో కరోనా అనంతరం విశాఖపట్నంలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల(జూన్) 14న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ విక్రయాలను వారం రోజుల కిందట ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో నేటి(బుధవారం) నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారు.
ఏసీఏ-వీడీసీఏ స్టేడియం 17వ ప్రవేశ ద్వారం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, రామ టాకీస్, జ్యోతి థియేటర్ వద్ద టికెట్లను విక్రయించనున్నట్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేన్ తెలిపింది. ఈ క్రమంలో టికెట్లు కొనుగోలు చేసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. టికెట్ల కనీస ధర రూ. 600 నుంచి రూ. 6వేల వరకు ఉన్నాయి. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని పోటిపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి తోపులాట జరుగకుండా విశాఖ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలెట్టాయి.