విశాఖలో ఆ టైమ్‌లో బయటకొస్తే.. వేలిముద్రలు తీసుకుంటారు.. లేదంటే..!
If you come out at that time in Visakhapatnam you have to put fingerprints. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వారిని ఆపి వారి గుర్తింపు కార్డులు చూసి, లేదంటే వారి వేలి ముద్రలను తీసుకుని పంపిస్తున్నారు.
By అంజి Published on 22 Nov 2021 9:06 AM ISTనేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేలా విశాఖ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వారిని ఆపి వారి గుర్తింపు కార్డులు చూసి, లేదంటే వారి వేలి ముద్రలను తీసుకుని పంపిస్తున్నారు. ఒక వేళ వారిపై అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇది విశాఖలో అమలవుతున్న.. పకడ్బందీగా అమలు చేయాలని సీపీ మనీశ్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. గడిచిన 2 నెలలుగా ఈ విధానం కొనసాగుతోంది. నేరాలపై నియంత్రణ సాధించేందుకు విశాఖ నగర పోలీసు విభాగం ఈ కార్యాచరణ రూపొందించింది. చోరీలు, హత్యలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని ఈ వ్యవస్థ ద్వారా త్వరగా గుర్తించవచ్చు. నగరంలో ప్రతి రోజు రాత్రి 120 మంది వేలిముద్రలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఈ వేలిముద్రల సేకరణ ద్వారా నిత్యం దాదాపు ఆరుగురు పాత నేరస్థులను గుర్తిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా చోరీలకు పాల్పడే వారిని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి వేలి ముద్రలు సర్వర్‌లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి వేళ తీసుకుంటున్న వేలి ముద్రలతో అవి సరిపోలితే వెంటనే పీఎస్‌కు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్థులు పట్టుబడితే ఆ ప్రాంతాలకు చెందిన పీఎస్‌లకు వెంటనే సమాచారం అందిస్తున్నారు. వేలి ముద్రల సేకరణ కోసం 'నైట్ సెక్యూరిటీ చెక్ డివైజ్'లను పోలీసులు వినియోగిస్తున్నారు. ఒక్కో పోలీస్ స్టేషన్‌లో మూడు చొప్పున వీటిని అందించారు. బ్లూకోట్స్, నేర విభాగం, శాంతి భద్రతల దగ్గర మరికొన్ని డివైజ్‌లను ఉంచారు.
నగరంలో రోజు అనుమానాస్పదంగా తిరిగే, నేరాలకు పాల్పడే వారి వేలి ముద్రలను సేకరించి సర్వర్‌లో పొందుపరుస్తున్నారు. విశాఖ పర్యాటక ప్రాంతం కావడంతో రోజు ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. ఇటీవల కాలంలో నగరంలో ఏటీఎంల, హుండీలు, ఇళ్లలో చోరీల కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సొమ్ములు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రి వేళ బయటకు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్‌తో పాటు తగిన గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇది ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి కాదని, నేరాలను అదుపు చేయడం కోసమని పోలీసులు చెబుతున్నారు.