మనీలాండరింగ్ విచారణలో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ, తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరికొంతమంది నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. విశాఖపట్నంతో సహా కనీసం ఐదు ప్రదేశాలలో ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో సత్యనారాయణ, ఇతరులపై రాష్ట్ర పోలీసు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖపట్నం స్థానం నుంచి పోటీ చేసిన సత్యనారాయణ గెలిచారు. ఈ సారి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన పలు తెలుగు చిత్రాలను నిర్మించారు.
విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 12.5 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో సత్యనారాయణతో పాటు మరికొందరు లాక్కోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.