అవమానవీయ ఘటన.. అంబులెన్స్ లేక.. స్కూటీపై 120 కి.మీ బిడ్డ మృతదేహంతో ప్రయాణం
Couple carry dead baby home in 2-wheeler as KGH fails to provide ambulance.చిన్నారి మృతదేహన్నితల్లిదండ్రులు ఆస్పత్రి
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2023 12:42 PM GMTప్రభుత్వ ఆస్పత్రులు అంటే ప్రజలు హడలిపోతున్నారు. ప్రాణాలు కాపాడటం సంగతి అటుంచితే మృతదేహాలను ఇంటికి చేర్చలేని దారుణ ఘటనలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఓ చిన్నారి మృతదేహన్ని తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి 120 కిలోమీటర్లు బైక్‌పై తరలించిన ఘటన అందరిని కలచివేస్తోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముత్యంకిపొట్టు మండలం కుముడ గ్రామానికి చెందిన మహేశ్వరి పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. శ్వాస సంబంధిత సమస్యతో చిన్నారి ఇబ్బంది పడుతుండడంతో ఫిబ్రవరి 2న చిన్నారిని విశాఖ కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి శిశువుని ఎన్‌ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఫిబ్రవరి 16 గురువారం ఉదయం 7.30 గంటలకు పాప చనిపోయింది.
శిశువు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యానికి తల్లిదండ్రులు కోరగా అందుకు వారు నిరాకరించారు. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో స్కూటీపైనే పాడేరు పయనం అయ్యారు. పాడేరు నుంచి అంబులెన్స్ లో చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దీనిపై కేజీహెచ్ ప్రాంతీయ వైద్యాధికారి వాసుదేవరావు మీడియాతో మాట్లాడుతూ.. మృతులను స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కేజీహెచ్ మహాప్రస్థానం వాహనాన్ని అందజేస్తోంది. అయితే పాప తల్లిదండ్రులు గిరిజనులు కావడంతో ఐటీడీఏ అందించే వాహనం కోసం గిరిజన ఆరోగ్య సెల్‌తో సమన్వయం చేసుకోవాలి. సెల్ వద్ద వాహనం లేకపోతే, మేము వాహనాన్ని అందిస్తాము. కానీ వాహనం గురించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు.
"వాహనాన్ని అందించకముందే తల్లిదండ్రులు వారి స్వంతంగా వెళ్లారని గిరిజన సెల్ ద్వారా మాకు చెప్పబడింది" అని ఆయన తెలిపారు.
శిశువు మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని, వాహనం కావాలని కేజీహెచ్ అధికారులు తెలిపారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు.