కేంద్రంతో మా బంధం రాజకీయాలకు అతీతం : ముఖ్యమంత్రి జగన్
CM Jagan Speech in Vizag PM Modi Public meeting.కేంద్రప్రభుత్వంతో మాకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతం అని జగన్
By తోట వంశీ కుమార్ Published on 12 Nov 2022 11:28 AM ISTకేంద్రప్రభుత్వంతో మాకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖ జనసంద్రాన్ని తలపిస్తోంది. విశాఖపట్నంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలి వచ్చారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా తరలివచ్చారన్నారు. రాష్ట్రంలో రూ. 10,742 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా దూసుకువెలుతోందన్నారు. విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు, మహిళా సంక్షేమం వంటి కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధిని సాధించామని చెప్పారు. గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు వివరించారు. పెద్ద మనసుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తు పెట్టుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు పలు అంశాలపై విజ్క్షప్తి చేశాం. ఏపీకి సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు.
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు మరో ఎజెండా లేదు. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మరింత కావాలన్నారు. విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని సీఎం జగన్ అన్నారు.