దసరా నుంచి విశాఖలోనే అంటున్న వైసీపీ ప్రభుత్వం
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలని వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుండో అనుకుంటూ
By Medi Samrat Published on 20 Sept 2023 2:43 PM IST
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలని వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుండో అనుకుంటూ ఉంది. కానీ అందుకు సంబంధించి సరైన సమయం రావడం లేదని తెలుస్తోంది. తాజాగా విశాఖ నుండి పరిపాలనకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరగబోతుందని.. ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందనే క్లారిటీ వచ్చింది. విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ చెప్పారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాల ఎంపిక విషయంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల తరలింపు ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించిన అవకాశాలపై సీఎం జగన్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలోనే ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి విశాఖపట్నం నుంచి పాలన మొదలవుతుందని కేబినెట్ తీర్మానించింది. ఇప్పటికే అందుకు సంబంధించి పలు నిర్మాణాలు జరుగుతున్నాయి.