యూపీలోని సీతాపూర్‌లో ఓ మహిళ తన భర్తకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నడిరోడ్డుపై చితకబాదిన ఘటన వైరల్‌గా మారింది. ఫిరోజాబాద్‌కు చెందిన అజయ్ నగర్ అనే వ్యక్తి సీతాపూర్‌లోని ఓ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అతను తన కారులో స్కూల్ నుండి వస్తుండగా, బుర్ఖా ధరించిన అతని భర్త అడ్డుకొని కారు అద్దాలు పగలగొట్టి, అందరూ చూస్తుండగానే అతనిపై దాడి చేసింది.
మొదట ఎవరో గుర్తు తెలియని మహిళ అనుకున్న ప్రత్యక్ష సాక్షులు, ఆమె బుర్ఖా తీసిన తర్వాత భార్య అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో భర్త కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో రద్దీగా ఉండే కూడలిలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ దృశ్యాలను అక్కడి వారు రికార్డ్ చేయడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇది గృహ వివాదమని ప్రాథమికంగా తేలింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.