మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాలేజీ వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఓ 20 ఏళ్ల విద్యార్థిని ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ధరాశివ్‌లోని ఆర్‌జీ షిండే కాలేజీలో ఏప్రిల్ 3వ తేదీన కాలేజీకి సంబంధించిన ఓ కార్యక్రమం జరిగింది. వర్ష ఖరత్ అనే విద్యార్థిని తన వీడ్కోలు ప్రసంగం ఇస్తుండగా హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలి చనిపోయింది. కాగా ఆమెను తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేసిన, అక్కడికి చేరుకునే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే వర్షకు ఎనిమిది సంవత్సరాల వయస్సులో గుండె శస్త్ర చికిత్స జరిగిందని..గత పన్నెండు సంవత్సరాలుగా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించలేదని, ఎలాంటి మెడిసన్ కూడా తీసుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా విద్యార్థిని ఆకస్మిక మరణంపై స్నేహితులు, కాలేజీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.