మహిళను ఒళ్లో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్

బీఆర్ఎస్‌ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళను మల్లారెడ్డి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  27 Oct 2023 4:00 PM GMT
telangana, brs, minister malla reddy, viral video,

 మహిళను ఒళ్లో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్

ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రజాప్రతినిధులు ప్రజలకు వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తుంటారు. ప్రభుత్వంలో ఉన్నవారు అయితే.. తాము చేసిన పనులు వివరించి తమకు మరోసారి మద్దతు ఇవ్వాలని కోరుతుంటారు. ఇక ఇతర పార్టీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వం విఫలమైన తీరుని వివరిస్తూనే.. తాము అధికారంలో వస్తే ఏం చేస్తామనేదానిపై హామీలిస్తూ ఓట్లడుగుతుంటారు. కానీ.. కొందరు నాయకులు మాత్రమే కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. ప్రజల మనస్సుల్లో పడేందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు.

ఇక ఎన్నికల సమయంలో అయితే.. ఇలాంటి దృశ్యాలను చాలానే చూస్తుంటాం. మొన్నటికి మొన్న తెలంగాణలో ప్రచారంలో భాగా రాహుల్‌గాంధీ దోసెలు వేస్తూ కనిపించారు. తాజాగా మల్లారెడ్డి చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. మల్లారెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మహిళలు అందరూ కింద కూర్చొని ఉండగా మంత్రి మల్లారెడ్డి కూడా వెళ్లి వారి మధ్యలో కూర్చున్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

అయితే.. ఉన్నట్లుండి వెనకాలే కూర్చొన్న ఓ మహిళను మంత్రి మల్లారెడ్డి ముందుకు రమ్మని చెప్పారు. దాంతో ఆమె కూడా ముందుకు వచ్చింది. ఆమెను అలాగే తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు మంత్రి మల్లారెడ్డి. ఆ తర్వాత ఆమెను తన ఒళ్లోనే చిన్న పిల్లల్లా పడుకోబెట్టుకుని ఫొటోలకు స్టిల్ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి చేసిన పనితో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పాలమ్మినవ్.. పూలమ్మినవ్.. ఓట్ల కోసం ఇదేందయ్యా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పాత డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. మల్లన్న స్టైలే వేరంటున్నారు. ఇంకొందరు మద్దతుదారులు ఆయన సమర్దిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story