Telangana: కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదని బోరున ఏడ్చేసిన నేత, రాజీనామా

తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  28 Oct 2023 5:45 PM IST
telangana, elections, congress, yellareddy, subhash reddy, cry,

Telangana: కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వలేదని బోరున ఏడ్చేసిన నేత, రాజీనామా

తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ రెండు జాబితాల్లో మొత్తం 100 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ 53 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. అయితే.. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన ఓ నాయకుడు బోరున విలపించాడు. కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సీటును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్‌ రావుకు కేటాయించింది కాంగ్రెస్. దాంతో.. ఆ పార్టీకి సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తీవ్ర ఆవేదన చెందారు. కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. బోరున విలపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని అయినా టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి. ఈయన ఒక్కరే కాదు.. మరికొందరు ఆశావాహులు కూడా కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ మరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో ఆశావాహ నేత చలమల కృష్ణారెడ్డి, జూబ్లీహిల్స్‌లో పి. జనార్ధన్ రెడ్డికి టికెట్ నిరాకరించటంతో వారు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ నుంచి ఎల్లారెడ్డి అసెంబ్లీ టికెట్‌ దక్కించుకున్న మదన్‌ మోహన్‌రావు స్వయానా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకి అల్లుడు. గతంలో ఎర్రబెల్లితో కలిసి టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఎర్రబెల్లితో పాటే టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే.. బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు లేదన్న ఆవేదనతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు మదన్‌ మోహన్‌రావు. గత ఎన్నికల్లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేశారు. ఆరువేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నిక తర్వాత మదన్ మోహన్‌రావుకి కాంగ్రెస్‌లో పట్టు పెరిగింది. కాంగ్రెస్‌ ఎల్లారెడ్డి టికెట్ విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. సుభాష్‌రెడ్డి, మదన్‌ మోహన్‌రావు, ఏనుగు రవీందర్‌ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. చివరకు మదన్‌ మోహన్‌రావుకే టికెట్‌ కేటాయించిన కాంగ్రెస్‌ అధిష్టానం.

Next Story