ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఎమర్జెన్సీ వార్డులో చేరిన ఓ రోగి బెడ్ వద్ద పెట్టిన ఆహారాన్ని వీధికుక్క తిన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగింది. వీడియోలో మొరాదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్‌కి ఇచ్చిన ఆహారం తింటున్న వీధి కుక్క కనిపించింది. వీడియో వైరల్ కావడంతో, మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఘటనపై విచారణకు ఆదేశించారు.
దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో రోగి పక్కన ఉంచిన ఆహారం, పాల ప్యాకెట్‌ను కుక్క తింటున్నట్లు చూపించింది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ సీఎంవో డా. కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ, "ఈ వీడియో నా దృష్టికి వచ్చింది, దాని తర్వాత నేను ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (CMS) నేతృత్వంలో ఈ విషయంపై విచారణకు ఆదేశించాను. నేను దీనిని నిర్ధారించడానికి సీఎంఎస్‌ని ఆదేశించాను. ఆసుపత్రి వార్డుల్లోకి ఏ జంతువు కూడా రాకుండా చూసుకోవాలని ఆదేశించాను" అని అన్నారు.