భోపాల్‌లోని VIP రోడ్డులో ఒక మహిళతో కలిసి ఇద్దరు పురుషులు బైక్ పై వెళుతున్న వీడియో వైరల్ కావడంతో బైక్ మీద ఉన్న మగవాళ్ళను అరెస్టు చేశారు. అయితే ఆ మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. వైరల్ క్లిప్‌లో రోడ్డుపై వెళుతున్న బైక్ మీద ముగ్గురు కూర్చుని ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నట్లు, ఆ మహిళ అటుగా వెళ్తున్న వారిపై ముద్దులు పెడుతున్నట్లు చూడొచ్చు. కోహెఫిజా పోలీసులు, భోపాల్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రైడర్ హృతిక్ యాదవ్, పిలియన్ ప్రయాణీకుడు సుమిత్ కుమార్ అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. . స్టంట్‌లో పాల్గొన్న బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాదవ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ అధికారులు రవాణా శాఖకు లేఖ రాశారు.
ఫిబ్రవరి 28న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కోహెఫిజా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వేగంగా వెళ్తున్న బైక్‌పై ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ప్రయాణించడమే కాకుండా, ఆ మహిళ అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శిస్తూ రోడ్డుపై ఉన్న ఇతరులకు ప్రమాదం కలిగిస్తోందని ఫిర్యాదుదారుడు నివేదించారు. ఫిర్యాదు ఆధారంగా, నిందితులపై మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టంట్‌లో భాగమైన మహిళ జాడ తెలియలేదు.