Viral Video : బైకర్ ను అత్యంత దారుణంగా చంపేసిన ఖడ్గమృగం

అసోంలోని మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక బైకర్‌ను ఖడ్గమృగం అతి దారుణంగా చంపేసింది

By Medi Samrat  Published on  30 Sept 2024 6:42 PM IST
Viral Video : బైకర్ ను అత్యంత దారుణంగా చంపేసిన ఖడ్గమృగం

అసోంలోని మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక బైకర్‌ను ఖడ్గమృగం అతి దారుణంగా చంపేసింది. ఓ వ్యక్తిని వెంబడించి దాడి చేయడంతో మరణించాడు. బాధితుడు సద్దాం హుస్సేన్, సంఘటన స్థలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లా నివాసి.

37 ఏళ్ల సద్దాం హుస్సేన్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఖడ్గమృగం అతని వద్దకు వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న సద్దాం హుస్సేన్ బైక్ ను కింద పడేసి పక్కన ఉన్న పచ్చిక బయళ్లలోకి పరిగెత్తాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించలేదు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల ఖడ్గమృగం అతనిని వెంబడించి కింద పడేసి తొక్కేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.

2,800 కిలోగ్రాముల బరువుండే ఖడ్గమృగాన్ని భయపెట్టాలని స్థానికులు అరిచారు కూడా..! అయితే ఆ తర్వాత పొలంలో హుస్సేన్ తల పగిలిపోయి కనిపించాడు. "వన్యప్రాణుల అభయారణ్యం నుండి ఖడ్గమృగం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నాము" అని అటవీ అధికారి ఒకరు వార్తా సంస్థ ANIకి తెలిపారు. అస్సాం రాజధాని గౌహతి శివారులో ఉన్న పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది.

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా ఈ నెలలో విడుదల చేసిన డేటా ప్రకారం భారత్‌లో ఒక కొమ్ము గల ఆసియా ఖడ్గమృగాల జనాభా గత నాలుగు దశాబ్దాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. నాలుగు దశాబ్దాల క్రితం 1,500గా ఉన్న ఖడ్గ మృగాలా సంఖ్య ఇప్పుడు 4,000కు పెరిగింది.

Next Story