అయ్యో! కొత్త కారుకి ఆలయంలో పూజ.. క్షణాల్లోనే యాక్సిడెంట్ (వీడియో)

పూజ కంప్లీట్ చేసుకున్నాడో లేదో.. క్షణాల్లోనే ఆ కారు ప్రమాదానికి గురైంది.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 11:12 AM IST
new car, accident, tamilnadu, viral video,

అయ్యో! కొత్త కారుకి ఆలయంలో పూజ.. క్షణాల్లోనే యాక్సిడెంట్ (వీడియో)

ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇంటితో పాటు.. ఇక కారు ఉండాలని అనుకుంటారు. సొంత ఇల్లు ఉన్నా కూడా చాలా మందికి కారుని కొనలేని స్థితిలో ఉంటారు. అయితే.. తాజాగా ఓ వ్యక్తి ఇష్టపడి ఒక కారు కొన్నాడు. ఆ తర్వాత దాన్ని పూజ కోసం ఆలయానికి తీసుకెళ్లాడు. ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాడో లేదో.. క్షణాల్లోనే ఆ కారు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులోని కడలూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొత్తకారు కొన్న ఆనందం తొలి రోజే ఆవిరైపోయింది. ముచ్చటపడి కొనుకున్న కారు తొలి రోజే యాక్సిడెంట్‌ కావడంతో చేదు అనుభవాన్ని మిగిల్చింది. సుధాకర్ అనే డ్రైవర్‌ ఇటీవల మారుతి కంపెనీకి చెందిన ఈకో మోడల్ కారును కొన్నాడు. పూజ కోసం కడలూర్‌లోని ఓ ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ పూజారితో వాహన పూచ చేయించాడు. పూలతో అలంకరించి.. బొట్లు కూడా పెట్టాడు కారుకి. అయితే.. వాహన పూజ పూర్తయ్యాక కొంచెం ముందుకు కారును కదపాల్సి ఉంటుందని పూజారి చెప్పాడు. దాంతో.. కారును ఆ వ్యక్తి స్టార్ట్‌ చేశాడు. ఈ క్రమంలోనే కారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. ఆలయం ఆవరణలో ఉన్న రెండు మెట్ల పై నుంచి ఎగిరి ముందుకు వెళ్లిపోయింది. అక్కడే ఉన్న బంధువు ఒకరు కారు డోర్‌కు వేలాడి ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతడిని కూడా కారు ఈడ్చుకుని పోయింది.

కారు గుడి రాజగోపురం నుంచి బయటకు దూసుకెళ్లింది. గుడి బయట ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే.. అదృష్టవశాత్తు కారు డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే వీడియోను ఓ వ్యక్తి నెట్టింట అప్‌లోడ్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మొదటి రోజే కారు ఇన్సూరెన్స్‌ అవసరం ఏర్పడిదంటూ చెబుతున్నారు.


Next Story