'ఛావా' మూవీ ప్రభావం..మధ్యప్రదేశ్‌లో అర్ధరాత్రుళ్లు బంగారం కోసం తవ్వకాలు

మొఘల్ కాలం నాటి బంగారం గురించిన పుకార్లు మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కలకలం రేపాయి.

By Knakam Karthik  Published on  8 March 2025 4:28 PM IST
National News, Chhaava Movie, Madhyapradesh, Burhanpur, Gold Viral Video

'ఛావా' మూవీ ప్రభావం..మధ్యప్రదేశ్‌లో అర్ధరాత్రుళ్లు బంగారం కోసం తవ్వకాలు 

మొఘల్ కాలం నాటి బంగారం గురించిన పుకార్లు మధ్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో కలకలం రేపాయి. బుర్హన్‌పూర్‌లోని అసిర్‌గఢ్ కోట వద్ద రాత్రయితే చాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. టార్చ్ లైట్లు వేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు. జల్లెడలు, మెటల్ డిటెక్టర్లు వినియోగిస్తున్నారు. ఎవరికి వారు బంగారం, వెండి నాణేలు దొరికాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో చీకటి పడితే చాలు ఊళ్లకు ఊళ్ల ప్రజలు ఆ ప్రాంతంలో గుప్తనిధుల వేట సాగిస్తున్నారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మూవీలో ఈ ప్రాంతాన్ని బంగారం గనులున్నాయంటూ పేర్కొనడం ఈ గుప్త నిధుల ప్రచారానికి ఆజ్యం పోసింది.

స్థానికంగా జాతీయ రహదారుల పనుల్లో భాగంగా దర్గా సమీపంలో జేసీబీ సాయంతో ఇటీవల మట్టి తవ్వకాలు చేపట్టారు. ఆ మట్టిని కోట ఉండే గ్రామానికి సమీపంలో ఓ పొలంలో పారబోశారు. ఆ మట్టిలో స్థానికంగా ఉండే కూలీలు పురాతన నాణేలను గుర్తించారు. వాటిని మొఘలుల కాలం నాటి బంగారం, వెండి నాణేలుగా కొందరు ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఆ నోటా ఈ నోటా పాకి గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల వారు గుప్తనిధుల వేట మొదలు పెట్టారు. 'ఛావా' చిత్రంలో మొఘలుల కాలంలో ఈ ప్రాంతం ఛత్రపతి శంభాజీ మహారాజుకు మిలటరీ క్యాంప్ ఉండేదని, బంగారం గనులు ఉండేవని పేర్కొనడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

"అసిర్‌గఢ్ నిధి వేటగాళ్లతో కిటకిటలాడుతోంది. హరూన్ షేక్ పొలంలో బంగారు నాణేలు దొరుకుతున్నాయి," అని స్థానిక నివాసి వసీం ఖాన్ అన్నారు. దీంతో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. నిధుల కోసం తవ్వకాలు చాలా రోజులుగా కొనసాగిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్ మాట్లాడుతూ, "మాకు నివేదికల గురించి తెలుసు, దర్యాప్తు చేస్తున్నాము. ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు పట్టుబడితే, చర్యలు తీసుకుంటాము" అని అన్నారు.

Next Story