ఒక వధువు తన పెళ్లి రోజున సహజమైన రూపంతో కనిపించడానికి ఇష్టపడింది. తల మీద ఎలాంటి విగ్ లేకుండా ధైర్యంగా కనిపించింది. యుఎస్‌లో ఉన్న కంటెంట్ క్రియేటర్ నీహర్ సచ్‌దేవా, ఆమె పెళ్లి వీడియో, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలోపేసియాతో బాధపడుతున్న నీహార్ కు తల మీద ఉన్న జుట్టు మొత్తం పోయింది. అయినా కూడా ఆమె ధైర్యంగా, ఆనందంగా పెళ్లి వేడుకకు ఎలాంటి విగ్ లాంటివి లేకుండా హాజరైంది.
ఎరుపు రంగు లెహంగా, ఆభరణాలు ధరించి నీహార్ తన కాబోయే భర్త అరుణ్ వి.గణపతి వైపు నడిచింది. ఈ వీడియో 40 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. తనకు చిన్న వయసులో జుట్టు ఉండేదని, కానీ తన అనారోగ్యం రీత్యా జుట్టును కోల్పోవాల్సి వచ్చిందని నీహార్ తెలిపింది. విగ్ ధరించడం తనకు ఎంపిక కాదని.. అందుకే పెళ్లి రోజు నేను నాలా కనిపించాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పడం విశేషం.