రోహిత్‌ శర్మ అభిమానికి చుక్కలు చూపించిన యూఎస్ పోలీస్ (వీడియో)

టీ20 వరల్డ్‌ కప్-2024లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  2 Jun 2024 9:00 AM IST
india vs bangladesh, t20 world cup, rohit sharma, fan, viral video,

రోహిత్‌ శర్మ అభిమానికి చుక్కలు చూపించిన యూఎస్ పోలీస్ (వీడియో)

టీ20 వరల్డ్‌ కప్-2024లో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య వార్మప్ మ్యాచ్‌ జరిగింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. కాగా.. మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో గ్రౌండ్‌లో ఉత్కంఠ పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా టీమిండియా క్రికెటర్ల అభిమానులు మ్యాచ్‌లు జరుగుతున్న క్రమంలో గ్రౌండ్‌లోకి ఒక్కసారిగా దూసుకెళ్లి షేక్‌ ఇవ్వడం.. పాదాబివందనం చేస్తుంటారు. ఇదంతా ఇండియాలోని మైదానాల్లో చాలా సార్లు జరిగాయి. అందరం చూశాం కూడా. తాజాగా న్యూయార్క్‌లో కూడా రోహిత్‌ శర్మ అభిమాని ఒకరు ఆయన్ని కలిసేందుకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. హిట్‌మ్యాన్‌ వద్దకు వెళ్లి ఆయన్ని హత్తుకున్నాడు. ఇక ఒక వ్యక్తి గ్రౌండ్‌లోకి చొరబడ్డాడని గమనించిన యూఎస్ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

స్పీడ్‌గా పరిగెత్తి రోహిత్‌ వద్దకు వచ్చిన అభిమానిని తమదైన స్టైల్లో కిందపడేసి.. నేలకు అదిమిపట్టి పట్టుకున్నారు. కనీసం కదలకుండా చేశారు. ఇక రోహిత్‌ శర్మ కూడా వెంటనే కంగారుపడ్డాడు. అతన్ని వదిలేయండని పోలీసులకు సూచించాడు. కానీ అమెరికా పోలీసులు మాత్రం అతన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. నేలకేసి అదిమి కదలకుండా పట్టుకున్నారు. చేతులు వెనక్కి విరిచారు. ఆ తర్వాత అక్కడికి మరికొందరు పోలీసులు వచ్చారు. రోహిత్‌ అభిమానిని అక్కడి నుంచి గ్రౌండ్‌ బయటకు పట్టుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లకు వెళ్తున్న టీమిండియా అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రౌండ్‌లోకి వెళ్లి అభిమాన క్రికెటర్‌ను కలుద్దామని అనుకుంటే ఇలానే చిక్కుల్లో పడి చుక్కలు చూడాల్సి వస్తుందని అంటున్నారు. మన భారత్‌లో లాగా సున్నితంగా వ్యవహరించరు అనీ.. తేడా వస్తే కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. కాగా.. ఈ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగుల చేయగా.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Next Story