Hyderabad: హాస్టల్‌లో నీళ్లు వాడుకున్నాడనీ.. యువకుడిపై విచక్షణారహితంగా దాడి (వీడియో)

నగరంలోని ఎస్సార్‌నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla
Published on : 7 May 2024 2:08 PM IST

hyderabad, hostel owner, attack,   viral video,

హాస్టల్‌లో నీళ్లు వాడుకున్నాడనీ.. యువకుడిపై విచక్షణారహితంగా దాడి (వీడియో)

హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎండకాలం కావడం.. అంతేకాక గత సీజన్‌లో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దాంతో.. బోర్లు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక.. మరోవైపు ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నగరంలోని ఎస్సార్‌నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయివేట్‌ హాస్టల్‌లో ఉంటున్న స్నేహితుడిని కలిసేందుకు యువకుడు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కాసేపు మాట్లాడాడు.

ఈ క్రమంలోనే సదురు యువకుడు హాస్ట్‌లోని కొన్ని నీళ్లను వాడుకున్నాడు. ఇది చూసిన హాస్టల్‌ నిర్వాహకుడు రెచ్చిపోయాడు. సదురు యువకుడితో గొడవ పెట్టుకున్నాడు. మా హాస్టల్‌లో నీళ్లను ఎందుకు వాడుతున్నావంటూ దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా సదురు యువకుడిని హాస్టల్‌ నిర్వాహకుడు కొట్టాడు. ఈ గొడవను గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని హాస్టల్‌ నిర్వాహకుడిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా.. అతను ఏమాత్రం వినిపించుకోలేదు. కాలుతో తన్నుతూ.. చేతులతో కొడుతూ దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటనలో సదురు యువకుడి షర్ట్‌ చినిగిపోయింది. శరీరంపై గాయాలు అయ్యాయి. ఇక హాస్టల్‌ నిర్వాహకుడిని అడ్డుకున్న యువకుడి స్నేహితుడిపై కూడా దాడి చేశాడు. దాంతో అతనికి కూడా స్వల్పగాయాలు అయ్యాయి.

ఈ గొడవ జరుగుతుండగా.. ఎదురుగా ఉన్న మరో భవనంలోని వ్యక్తులు వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వరల్ అవుతోంది. గొడవ ఎందుకు మొదలైంది? అంటూ ఆరా తీస్తున్నారు. హాస్టల్‌ నిర్వాహకుడిపై బాధిత స్నేహితులు ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story