వైర‌ల్‌.. చేతి పంపు నుంచి నీటితో పాటు ఎగిసిప‌డుతున్న మంట‌లు

Hand Pump Spews Fire In Madhya Pradesh Village.సాధార‌ణంగా చేతి పంపులోంచి నీరు వ‌స్తుంది. ఇది మ‌న‌కు తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2022 2:59 AM GMT
వైర‌ల్‌.. చేతి పంపు నుంచి నీటితో పాటు ఎగిసిప‌డుతున్న మంట‌లు

సాధార‌ణంగా చేతి పంపులోంచి నీరు వ‌స్తుంది. ఇది మ‌న‌కు తెలిసిందే. అయితే.. ఒకేసారి చేతిపంపు లోంచి నీరు ఎగ‌జిమ్మ‌డంతో పాటు మంట‌లు కలిసి ఎగిసిప‌డుతున్నాయి. దీన్ని చూసిన ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు. నీటి పంపు నుంచి నీరు, మంటలు ఎగసిపడుతుండటాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ ప్రాంతానికి పోటెత్తారు. ఈ వింత‌ను చూసి ఆశ్చ‌ర్యానికి గురి కావ‌డంతో పాటు త‌మ సెల్‌ఫోన్ల‌లో వీడియోలు తీసి సోష‌ల్ మీడియాల‌లో పోస్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఈ వింత ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఛతర్ పూర్ జిల్లాలోని బ‌క్స్‌వ‌హ ప్రాంతంలోని క‌చ్చ‌ర్ గ్రామంలో గురువారం ఉద‌యం వాకింగ్‌కు వెళ్లిన గ్రామ‌స్తులు దీన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. కాగా.. చేతిపంపు నుంచి నీటితో పాటు మంట‌లు రావ‌డం అద్భుత ఘ‌ట‌న‌ కాద‌ని, దీనివెనుక శాస్త్రీయ కార‌ణం ఉంద‌ని అధికారులు, జియాల‌జిస్టులు చెబుతున్నారు.

ఆ గ్రామంలో రెండే చేతి పంపులు ఉన్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు. ఓ చేతి పంపులో నీటితో పాటు మంట‌లు వ‌స్తుండ‌డంతో గ్రామంలో నీటి క‌ష్టాలు మొద‌లైన‌ట్లు స్థానికులు తెలిపారు.

ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌నే దానిపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. దీనిపై బ‌క్స్‌వ‌హ త‌హ‌సిల్దార్ జాం సింగ్ మాట్లాడుతూ.. ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, దీనిపై ఆరా తీస్తున్న‌ట్లు తెలిపారు. బోఫాల్ ప్ర‌భుత్వ సైన్స్ కాలేజీకి చెందిన డాక్ట‌ర్ జ్ఞానేంద్ర ప్ర‌తాప్ సింగ్ మాట్లాడుతూ.. బుక్కువా ప్రాంతంలోని భూమి పొర‌ల్లో వృక్ష, జంతు వ్య‌ర్థాలు పెద్ద ఎత్తున పోగుప‌డి ఉన్నాయ‌ని, ఈ క్ర‌మంలో ర‌సాయ‌న చ‌ర్య కార‌ణంగా మీథేన్ వాయువు మండుతూ పైకి చొచ్చుకువ‌చ్చింద‌న్నారు. దాంతో పాటు నీరు కూడా పైకి ఎగ‌జిమ్మితోంద‌ని వివ‌రించారు. ఇదేమీ వింత కాద‌న్నారు.

Next Story