మహారాష్ట్రలో వర్షం కురుస్తున్న సమయంలో రోడ్డుపైకి వచ్చిన పెద్ద మొసలి వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 8 అడుగుల మొసలి వర్షం కురుస్తున్న రహదారిపై హల్ చల్ చేస్తున్న వీడియో మహారాష్ట్ర తీర ప్రాంతంలోని చిప్లున్ పట్టణంలోనిది. రత్నగిరి జిల్లాలోని చిప్లున్ పట్టణంలోని చించ్నాకా ప్రాంతంలో స్థిరమైన కురుస్తున్న వర్షం మధ్య ఆటోరిక్షా డ్రైవర్ ఈ వీడియోను చిత్రీకరించాడని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద మొదలైంది.
అదే నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు కొట్టుకొచ్చిన ఒక మొసలి వాహనదారుల ముందే పాకుతూ వెళ్లింది. దీంతో బైకర్లు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అరుదైన, ప్రమాదకరమైన క్షణాన్ని చూస్తూ ప్రయాణికులతో మరికొన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోయినట్లు వీడియో చూపించింది. పీటీఐ రిపోర్టు ప్రకారం.. మొసలి సమీపంలోని శివ లేదా వశిష్టి నదుల నుండి పట్టణంలోకి ప్రవేశించి ఉండవచ్చు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.