ముంబై ట్రాఫిక్ పోలీసులు తనపై జరిమానా విధించిన తర్వాత బైక్ రైడర్ రోడ్డుపై అధికారులను ఆపుతున్న వీడియో వైరల్ కావడంతో, పోలీసు శాఖ స్పందించింది. హెల్మెట్ ధరించనందుకు జరిమానా ఎదుర్కొన్న వ్యక్తి, నంబర్ ప్లేట్ విరిగిన స్కూటర్‌ను పోలీసులు ఎలా నడుపుతారు అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా అధికారులను రోడ్డు మీదే ఆపడానికి ప్రయత్నించాడు. సంఘటన స్థలంలో ఉన్న మరొక వ్యక్తి చిత్రీకరించిన ఈ క్లిప్‌లో, ఓ వ్యక్తి ఇద్దరు ట్రాఫిక్ అధికారులు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఆపుతున్నట్లు చూడొచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
ట్రాఫిక్ పోలీసు డిప్యూటీ కమిషనర్ పంకజ్ షిర్సాత్ దీనిపై వివరణ ఇచ్చారు. సంఘటన జరిగిన మధ్యాహ్నం, హవల్దార్లు గైక్వాడ్, షెలార్ బీట్ మార్షల్ డ్యూటీలో ఉన్నారని ఆయన అన్నారు. ఆ సమయంలో గైక్వాడ్ తన స్నేహితుడి వాహనాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. విధి నిర్వహణలో గైక్వాడ్ హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు ఒక యువకుడికి చలాన్ జారీ చేసి, ఆపై తన గస్తీ కొనసాగించాడు. వారు అదే ప్రాంతానికి తిరిగి వచ్చినప్పుడు, అదే యువకుడు దురుద్దేశంతో అధికారుల వీడియోను రికార్డు చేసి ఆన్‌లైన్‌లో వైరల్ చేశాడని షిర్సాత్ వివరించారు. పోలీసు స్కూటర్‌కు నంబర్ ప్లేట్ లేదని వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేదని ఆయన స్పష్టం చేశారు. వెనుక నంబర్ ప్లేట్ ఉందని, ముందు భాగం మాత్రమే సరిగ్గా లేదని ఆయన అన్నారు.