ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు అటవీ అధికారుల సాహసం గురించి పంచుకున్నారు. వారు ఓ చిన్న ఏనుగును రక్షించి.. తల్లి చెంతకు చేర్చారు. ఇందు కోసం అటవీ అధికారులు అసాధారణమైన అంకితభావాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించారు. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పొల్లాచ్చి లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీంతో తల్లి ఏనుగు అటవీ అధికారులకు "కృతజ్ఞతలు" తెలిపిందని సాహు పంచుకున్నారు.
పిల్ల ఏనుగు ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడిపోయింది. తల్లి ఏనుగు ఎంత ప్రయత్నించినప్పటికీ, బలమైన నీటి ప్రవాహం కారణంగా పిల్ల ఏనుగు బయటకు రావడం కష్టమైంది. ఎఫ్‌డి రామసుబ్రమణ్యం, డిడి బి తేజ, పుగలేంటి ఎఫ్‌ఆర్‌ఓ, తిలకర్ ఫారెస్టర్, శరవణన్ ఫారెస్ట్ గార్డు, వెల్లింగిరి ఫారెస్ట్ గార్డు, మురళి ఫారెస్ట్ వాచర్, రాసు ఫారెస్ట్ వాచర్, బాలు ఎపిడబ్ల్యు, నాగరాజ్ ఎపిడబ్ల్యు, మహేష్ ఎపిడబ్ల్యు, ఫారెస్ట్ గార్డు చిన్నతాన్ కలిసి ఆ ఏనుగును బయటకు తీసి.. తల్లి చెంతకు చేర్చారు. వెళుతూ వెళుతూ.. ఏనుగు తన తొండంతో ధన్యవాదాలు తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.