బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఒక వ్యక్తి కదులుతున్న వాహనం ముందు ఉద్దేశపూర్వకంగా పడుకున్నాడు. కారు ఢీకొట్టిందని రోడ్డుపై ఉన్న వాళ్లను నమ్మించడానికి ప్రయత్నించాడు. అయితే కారుకు డాష్‌క్యామ్ ఉండడం చాలా మంచిది అయింది. ఆ వ్యక్తి మోసం చేయడానికి ప్రయత్నించాడని స్పష్టంగా తెలిసిపోయింది. ఇలాంటి మోసాల నుండి రక్షించడంలో డాష్‌క్యామ్‌ల ఉపయోగం స్పష్టంగా తెలుస్తోంది. ఈ డాష్ క్యామ్ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
వీడియోలో, వ్యక్తి కారు ముందు పరిగెత్తుకుంటూ వచ్చి.. నేలపై పడిపోతాడు, అతను కారు గుద్దడం వల్ల కింద పడిపోయాడని నమ్మించడానికి ప్రయత్నించాడు. కొందరు రోడ్డుపై కారును ఆపడానికి ప్రయత్నించగా.. డ్రైవర్ ప్రతిదీ డాష్‌క్యామ్‌లో రికార్డు అయిందని చెప్పాడు. ఇద్దరు బైకర్లు కారు అడ్డుకోడానికి ప్రయత్నించారు. వారికి కూడా జరిగిందంతా రికార్డు అయిందని చెప్పడంతో సైలెంట్ అయిపోయారు.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 'safecars_india,'లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కేవలం ఒక్క రోజులో 2.9 మిలియన్ల వ్యూస్, 70,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. కారు యజమానులు డాష్‌క్యామ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని పోస్ట్‌లో కోరారు. అలాంటి మోసాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.