Fact Check : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వీడియో వైరల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 3:02 AM GMTటీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతూ ఉన్నారంటూ బీజేపీ నేతలు వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. ఓటర్లకు డబ్బులు పంచడంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బిజీగా ఉంది అంటూ వీడియో ద్వారా తెలుపుతూ ఉన్నారు. ఆ వీడియోలో టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వ్యక్తులు ప్రజలకు డబ్బులు ఇస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. 'దుబ్బాక బై ఎలెక్షన్లు.. డబ్బుకు బై ఎలెక్షన్లు' అంటూ వీడియోను పోస్టు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని చూడొచ్చు అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ వీడియో దుబ్బాకకు చెందినది కాదు.
ఈ వీడియోను పోస్టు చేస్తున్న వారికి కొందరు కామెంట్ల రూపంలో సమాధానం ఇచ్చారు. వీడియోను పోస్టు చేసిన ఎం.ఎల్.సి. రామ చందర్ రావు ఓటర్లను, ఎన్నికల కమీషన్ ను తప్పు ద్రోవ పట్టించే సమాచారాన్ని పోస్టు చేస్తున్నారని తెలిపారు. ఈ వీడియో పాతది అంటూ పలువురు చెప్పుకొచ్చారు.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు తెలుగు టీవీ ఛానల్స్ లో ఈ వీడియోలను టెలీకాస్ట్ చేశారు. NTV, CVR news లో వీడియోను పోస్టు చేయడం జరిగింది. ప్రజలకు టీఆర్ఎస్ నేతలు డబ్బులు, గిఫ్ట్ లు పంచుతూ ఉన్నారని వెల్లడించారు.
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ నేతలతో గొడవకు దిగినట్లు మీడియాలో చెప్పుకొచ్చారు. Telangana Today కూడా ఈ ఘటన గురించి చెప్పుకొచ్చింది. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి లోని వార్డ్ నెంబర్ 14లో మాజీ కౌన్సిలర్ వి గోపి డబ్బులను పంచుతూ మీడియాకు దొరికారు. జనవరి 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వైరల్ అవుతున్న వీడియోలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతూ కనిపించారు. ఈ వీడియో ఇప్పటిది కాదు... జనవరి 2020, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.