సెప్టెంబర్ నెలలో తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ నుండి హైటెక్ సిటీ, గచ్చి బౌలి, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ కు తక్కువ సమయంలోనే వెళ్లిపోవచ్చు. ఈ కేబుల్ బ్రిడ్జిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే.. సామాజిక దూరం కూడా పాటించకుండా ఫోటోలు తీసుకున్నారు.

నడి రోడ్డు మీద నిలబడి మరీ ఫోటోలు తీసుకుంటూ ఉన్న ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇలాంటి అతి చేసే వారి మీద చర్యలు తీసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ ఉన్నారు. డేంజరస్ స్టంట్స్ చేస్తున్న వారి మీద కూడా నిఘా పెట్టారు అధికారులు.

దుర్గం చెరువు బ్రిడ్జి మీద ఇద్దరు యువతులు వెళుతూ ఉండగా వేగంగా వెళుతున్న ఓ కారు ఆ ఇద్దరు యువతులలో ఒకరిని ఢీకొట్టి వెళ్లిందని వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి మీద చోటుచేసుకున్న ఘటన అని పలువురు చెబుతూ వచ్చారు.సామాజిక మాధ్యమాల్లో కూడా అందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. రోడ్డు మీద నడిచే సమయంలో చాలా మంది అజాగ్రత్తతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారు జాగ్రత్త పడాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటారు. అధికారులు, ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా రోడ్ల మీద స్టంట్స్ చేసే వారు.. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వారి సంఖ్య అసలు తగ్గడం లేదు.

సైబరాబాద్ పోలీసులు కూడా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద ఫోటోలు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ బ్రిడ్జి మీద రాత్రి 11 గంటల తర్వాత ట్రాఫిక్ ను అనుమతించడం లేదని అన్నారు. ఇక ప్రజలు కూడా రోడ్డు మీదకు వచ్చి మరీ ఫోటోలు తీసుకోవడం మానేయాలని కోరుతూ ఉన్నారు. ఇప్పటి దాకా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద రోడ్డు ప్రమాదం కారణంగా ఎవరూ చనిపోలేదని అధికారులు ధృవీకరించారు.వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదని 2017 సంవత్సరం నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. సెప్టెంబర్ నెల 2017 సంవత్సరంలో చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Leak.com వెబ్సైట్ లో ఈ వీడియోను పోస్టు చేశారు. “Assume China as voiceover sounds Chinese and this kind of event is just typical of the kinda shit that goes down there…” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.

2017 సంవత్సరం సెప్టెంబర్ నెలలో చోటు చేసుకున్న ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు అంటూ Zhangzs.com లో అప్లోడ్ చేశారు.

ఈ వీడియో ఎక్కడ చోటు చేసుకుందో సరైన సమాచారం లేదు కానీ చైనాలో చోటుకుందని స్పష్టంగా తెలుస్తోంది. Misterikisah.com లో ఎటువంటి హెచ్చరికలు లేకుండా చోటు చేసుకున్న ప్రమాదాలు అంటూ సెప్టెంబర్ 2017 న వీడియో పబ్లిష్ చేశారు.

దుర్గం చెరువు బ్రిడ్జి మీద చోటు చేసుకున్న ఘటన అంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్దం'.

Claim Review :   Fact Check : దుర్గం చెరువు బ్రిడ్జి మీద యువతిని వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టిందంటూ వీడియో వైరల్..!
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story