Fact Check : రణ్ వీర్ సింగ్, దీపిక పదుకోన్ లతో కలసి దావూద్ ఇబ్రహీం భోజనం చేస్తూ కనిపించాడా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Sep 2020 9:28 AM GMTబాలీవుడ్ నటి దీపిక పదుకోన్, ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కలిసి మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంతో కలిసి భోజనం చేసారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆ ఫోటోను షేర్ చేస్తూ ఉన్నారు.
సందీప్ సింగ్, దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ లు కలిసి దావూద్ తో ఉన్నారంటూ ఓ ఫోటోను.. అందులో ఓ వ్యక్తిని మార్క్ చేసినట్లు.. అతడే దావూద్ అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
ట్విట్టర్ లోనే కాదు.. ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతోంది. కొందరు ఆ తర్వాత డిలీట్ కూడా చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను ఆగష్టు 2013న ‘Pinkvilla’ పోస్టు చేసింది. “Ranveer Singh & Deepika Padukone at the ‘Ram Leela’ iftar party” అంటూ హెడ్ లైన్ లో చెప్పుకొచ్చారు. రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ లు 'రామ్ లీల' సినిమా ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారంటూ తెలిపారు. క్రాప్ చేయని ఫోటోలో ఆ సినిమా దర్శకుడు 'సంజయ్ లీలా భన్సాలీ' కూడా ఉన్నారు.
కీవర్డ్స్ ద్వారా సెర్చ్ చేయగా సందీప్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఫోటోను పోస్టు చేశారు. “#Iftar is the time of huge blessings, try to gather as many as you can… Breaking bread together since 2013.” 2013 నుండి ఇఫ్తార్ చేసుకుంటూ ఉన్నామని అందులో తెలిపారు.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను ట్యాగ్ చేశాడు సందీప్. సామాజిక మాధ్యమాల్లో దావూద్ ఇబ్రహీం అంటూ జరుగుతున్న ప్రచారం ఎంత వరకూ నిజం కాదని.. అక్కడ ఉన్న ఆ వ్యక్తి పేరు 'వాసిక్ ఖాన్'. అతడు ప్రొడక్షన్ డిజైనర్. రామ్ లీల సినిమాలో అతడు కూడా పని చేశారు. చిత్ర యూనిట్ తో పాటూ అతడు కూడా ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నాడు.
https://instagram.com/officialsandipssingh?igshid=1m4rznu44ezdi లింక్ లో ఫోటోను చూడొచ్చు.
వైరల్ అవుతున్న ఫోటోకు.. వాసిక్ ఖాన్ కు దావూద్ ఇబ్రహీంకు ఉన్న తేడాలను గమనించవచ్చు. వాసిక్ ఖాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. ఆర్ట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశాడు.
దావూద్ ఇబ్రహీం అంటూ వైరల్ అవుతున్న పోస్టుపై వాసిక్ ఖాన్ స్పందించాడు. ఆ ఫోటోలో ఉన్నది నేనే.. నా పేరు దావూద్ ఇబ్రహీం కాదు. వాసిక్ ఖాన్.. ఒక పేద ప్రొడక్షన్ డిజైనర్. 2012 లో ఇఫ్తార్ పార్టీలో భాగంగా తీసుకున్న ఫోటో అని చెప్పుకొచ్చాడు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ లు దావూద్ ఇబ్రహీంతో కలిసి పార్టీ చేసుకున్నారు అంటున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.