Fact Check : తిరుమల కొండపై చర్చి వెలిసిందంటూ వాట్సప్ లో ఫోటోలు వైరల్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 3:30 PM GMT
Fact Check : తిరుమల కొండపై చర్చి వెలిసిందంటూ వాట్సప్ లో ఫోటోలు వైరల్..?

తిరుమల కొండపై చర్చి వెలిసిందంటూ గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో వెలసిన సంగతి తెలిసిందే..! తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయడం నిషిద్ధం. అయినప్పటికీ తిరుమల కొండపై చర్చి వెలిసిందంటూ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.

T1

తిరుమల కొండల్లో ఏర్పడిన మొదటి చర్చి.. ఇక ముందుంది పండుగ.. హిందువులారా ఇకనైనా మేలుకోండి అంటూ ఈ ఫోటోలను వైరల్ చేస్తూ ఉన్నారు. చెట్ల మధ్యలో ఓ బిల్డింగ్ ఉండడం గమనించవచ్చు. ఈ విషయంలో నిజం తెలియజేయాలంటూ న్యూస్ మీటర్ ను కొందరు కోరారు.

ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఫోటో వైరల్ అవుతూ ఉంది. తిరుమల కొండల్లో చర్చి వెలసింది అంటూ 2019 నుండే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.



నిజ నిర్ధారణ:

తిరుమల కొండల్లో చర్చి వెలసిందంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'అబద్ధం'

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదని చెబుతూ పలు తెలుగు మీడియా సంస్థలు గతంలోనే రిపోర్టులను అందించాయి. Alt news కూడా ఆగష్టు నెల 2019న ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

స్థానిక జర్నలిస్టులు ఈ వార్తలను ఖండిస్తూ నిజాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చారు. శేషాచలం జీవావరణం (Seshachalam Biosphere Reserve) కు చెందిన బిల్డింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ నడుస్తోంది. అక్కడ ఓ పోల్ కు ముందు సర్వేలైన్స్ కెమెరాలను ఉంచారు. దాన్ని చూసిన చాలా మంది అది శిలువ ఆకారంలో ఉందని.. చర్చిగా భావిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు.

T2

శేషాచలం కొండల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వన్యప్రాణి సంరక్షణ మీద నిఘా ఉంచడానికి కెమెరాలను వాడుతూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చేసిన ప్రయత్నాలను శిలువగా ఊహించుకుని పలువురు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.

Bharat Today అనే యూట్యూబ్ ఛానల్ లో అందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇచ్చారు. కొండ మీద దుష్ప్రచారం చేస్తున్నారని పలు మీడియా సంస్థలు నిజాలను వెలికి తీశాయి.

సెప్టెంబర్ 2019న తిరుపతి పోలీసులు ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అడవుల్లో వాచ్ టవర్ గా ఉపయోగించే పోల్ ను శిలువగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్నది చర్చి కాదు.. అది అటవీశాఖ అధికారులకు సంబంధించిన వాచ్ టవర్. సీసీటీవీ కెమెరాలకు ఉపయోగించిన పోల్ ను శిలువగా ప్రచారం చేశారు. తిరుమల కొండల్లో చర్చిని కట్టారు అంటూ చేస్తున్న ప్రచారంలో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story