Fact Check : 1918లో వ్యాక్సిన్ కారణంగా 50 మిలియన్ల మంది చనిపోయారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 8:48 AM IST
Fact Check : 1918లో వ్యాక్సిన్ కారణంగా 50 మిలియన్ల మంది చనిపోయారా..?

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని మానవజాతి ఎదురుచూస్తోంది. గతంలో కూడా మహమ్మారి రోగాలను అంతం చేయడానికి వ్యాక్సిన్ లను కనిపెట్టారు.

ఓ సిరంజీ ఉన్న బొమ్మ, ఆసుపత్రి బెడ్స్ ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అందులో “The 1918 Spanish Flu did not kill 50,000,000 people, Vaccines that the govt forced them to take did and they are repeating the same pattern now. 50 million dead from the 1918 flu vaccine.” అని ఉంది.

'1918లో స్పానిష్ ఫ్లూ కారణంగా 50 మిలియన్ల మంది చనిపోలేదు. ప్రభుత్వం వ్యాక్సిన్లను వేసుకోమని కోరడంతో ఈ మరణాలు సంభవించాయి అని అందులో ఉంది. 50 మిలియన్ల చనిపోడానికి కారణం 1918 ఫ్లూ వ్యాక్సిన్' అన్న పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ పోస్టులు 2012 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

నిజ నిర్ధారణ:

స్పానిష్ ఫ్లూ వ్యాక్సిన్ కారణంగా 50 మిలియన్ల మంది చనిపోయారన్నది 'పచ్చి అబద్ధం'. 1918 స్పానిష్ ఫ్లూకు వ్యాక్సిన్ కనుక్కున్నది 1940లలో..!

1918 లో వచ్చిన ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎంతో మందిని కబళించి వేసింది. ఏవియన్ ఆరిజిన్ జీన్స్ కు చెందిన హెచ్1ఎన్1 ద్వారా వైరస్ సోకింది. వైరస్ ఎక్కడ పుట్టింది అన్న విషయమై క్లారిటీ లేదు కాదు. 1918-1919 సమయంలో ప్రపంచం మొత్తాన్ని కబళించివేసింది. 1918 లో అమెరికా తమ మిలిటరీలో స్పానిష్ ఫ్లూ సోకడాన్ని గుర్తించింది. 500 మిలియన్ల జనాభా.. అంటే అప్పటి జనాభాలో మూడో వంతుకు ఈ వైరస్ సోకింది. 50 మిలియన్ల మంది దీని కారణంగా చనిపోయారని అప్పటి రికార్డులు చెబుతున్నాయి.

'History of Vaccines' ప్రకారం 1918 ఇన్ఫ్లుయెంజాకు నిర్ధిష్టమైన చికిత్స కానీ.. వ్యాక్సిన్ కానీ లేదు. అప్పటి వైజ్ఞానికులు, నిపుణులు ఇన్ఫ్లుయెంజాకు బ్యాక్టీరియా కారణమనే అనుకున్నారు. వైరస్ తో వచ్చిందని గుర్తించలేకపోయారు. వ్యాక్సిన్ ను కొన్ని దశాబ్దాలకు కానీ కనిపెట్టలేకపోయారు. ఈ ఫ్లూకు యాంటీ బయోటిక్స్ కూడా పని చేయలేదు.

CDC.gov కూడా 1918 ఫ్లూకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్లను అడ్డుకోడానికి ఎటువంటి వ్యాక్సిన్లు కూడా అప్పట్లో లభించలేదు. అప్పట్లో మెడికల్ గా కూడా గొప్పగా అభివృద్ధి చెందకపోవడంతో జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐసొలేషన్, క్వారెంటైన్, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు. బహిరంగ సభలను కూడా అప్పట్లోనే రద్దు చేశారు.

history.com కథనం ప్రకారం 1918 ఫ్లూ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారు. ఇక ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా సరైన అవగాహన లేకపోవడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయి.(లైసెన్స్ ఉన్న ఫ్లూ వ్యాక్సిన్ 1940 లలో అమెరికాలో కనుగొన్నారు)

50 మిలియన్ల మంది స్పానిష్ ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా చనిపోయారన్నది 'పచ్చి అబద్ధం'. 1918 లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించగా.. వ్యాక్సిన్ 1940లలో అందుబాటు లోకి వచ్చింది.

Next Story