విజయవాడ బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. గురువారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి గడ్కరీ సహకారంతో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ శరవేగంగా పూర్తయిందని.. పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ రోడ్డు పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తాను భాగం కావడం సంతోషంగా ఉందని గడ్కరీ అన్నారు. రోడ్ల అభివృద్ధి వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విశ్వసించారని అన్నారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న గ్రామ్ సడక్ యోజన అత్యంత కీలకమని అన్నారు.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. ఇక బీజేపీ తరపున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. మొదటగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి సందర్శించారు.